తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వినతులపై నిరంతర పర్యవేక్షణతో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి.సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ విద్యా చందనతో కలిసి స్వీకరించారు. భూ వివాదాలు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి, మౌలిక వసతులు, సామాజిక భద్రతతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలను ప్రజలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్, సమస్యల స్వభావాన్ని బట్టి సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఎండార్స్ చేసి, నిర్దేశిత గడువులో పరిష్కారం చూపాలని ఆదేశించారు. తక్షణమే పరిష్కరించగల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, మిగిలిన వినతులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేసే విశ్వసనీయ వేదిక అని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని కేవలం నమోదు చేయడమే కాకుండా, వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించి ఫలితాలు కనిపించేలా అధికారులు పనిచేయాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో వ్యవహరిస్తే సమస్యల పరిష్కారం మరింత వేగవంతమవుతుందని తెలిపారు.ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావు లేకుండా ప్రతి అధికారి బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ప్రజలు తమ వినతులతో పాటు సంబంధిత ఆధార పత్రాలను సమర్పిస్తే సమస్యల పరిష్కారం మరింత వేగంగా జరుగుతుందని తెలిపారు.ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని వినతులుచుంచుపల్లి మండలం పెనుబల్లి గ్రామానికి చెందిన ఊరబెట్టి జయ తన మామ ఊరబెట్టి భిక్షమయ్య 2024లో మరణించారని, ఆయన పేరుపై ఉన్న రెండు ఎకరాల భూమిని తన పేరుపై పట్టా మంజూరు చేయాలని ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ, భూ సర్వే పూర్తయినా ఇప్పటివరకు పట్టా మంజూరు కాలేదని తెలిపారు. ఈ దరఖాస్తును పరిశీలించిన జిల్లా కలెక్టర్ తదుపరి చర్యల కోసం చుంచుపల్లి తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు.టేకులపల్లి మండలం జెండాల తండాకు చెందిన బానోత్ రాంబాబు తాను దివ్యాంగుడినని, ప్రస్తుతం రేకుల ఇంటిలో నివసిస్తున్నానని, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద దరఖాస్తు చేసుకున్నానని, రెండో విడతలో తనకు ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ఈ దరఖాస్తును పరిశీలించిన జిల్లా కలెక్టర్ తదుపరి చర్యల కోసం గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌కు ఎండార్స్ చేశారు.టేకులపల్లి మండలం అప్పిరెడ్డిగూడెంకు చెందిన గిరిజన రైతు మోకాళ్ల నరసయ్య అనేక సంవత్సరాలుగా పోడు భూమిలో సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నానని, ఆ భూమే తమ కుటుంబానికి జీవనాధారమని, పోడు పట్టా మంజూరు చేయాలని కోరారు. ఈ దరఖాస్తును పరిశీలించిన జిల్లా కలెక్టర్ తదుపరి చర్యల కోసం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి ఎండార్స్ చేశారు. బూర్గంపాడు మండలం మోతెపట్టి నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని చింతకుంట గ్రామస్థులు గత 30 సంవత్సరాలుగా గ్రామంలో నివసిస్తున్నప్పటికీ అంగన్‌వాడీ కేంద్రం లేకపోవడంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు రెండు కిలోమీటర్ల దూరంలోని కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందని, తమ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ దరఖాస్తును పరిశీలించిన జిల్లా కలెక్టర్ తదుపరి చర్యల కోసం మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారికి ఎండార్స్ చేశారు.ఇల్లందు మండలం చల్లసముద్రం గ్రామానికి చెందిన గన్నేబోయిన వెంకటరమణ తాను 90 శాతం దివ్యాంగుడినని, శారీరక వైకల్యం కారణంగా స్థిరమైన ఉపాధి లేక కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా కంప్యూటర్ రంగంలో అనుభవం ఉన్నందున ప్రభుత్వ కార్యాలయంలో లేదా ఏదైనా శాఖలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉపాధి కల్పించాలని కోరారు. ఈ దరఖాస్తును పరిశీలించిన జిల్లా కలెక్టర్ తదుపరి చర్యల కోసం జిల్లా ఉపాధి కల్పనాధికారికి ఎండార్స్ చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ