తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విశ్వకర్మల నైపుణ్యం, శ్రమ, సృజనాత్మకత సమాజ ప్రగతికి కీలకం: కలెక్టర్ అంకిత్ విశ్వకర్మల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత: ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు,కోరం కనకయ్య వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలను ఆధ్యాత్మిక భావంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యలు విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, యజ్ఞ మహోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విశ్వకర్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. విరాట్ విశ్వకర్మను దైవస్వరూపంగా భావిస్తూ భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు . ప్రాచీన కాలం నుంచే విశ్వకర్మలు తమ అపారమైన నైపుణ్యం, శ్రమ, సృజనాత్మకతతో సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారని అన్నారు. కళలు, చేతివృత్తులు, నిర్మాణ రంగాలతో పాటు వివిధ రంగాల్లో విశ్వకర్మలు అందించిన సేవలు సమాజ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయని తెలిపారు. తరతరాలుగా కొనసాగుతున్న వారి సంప్రదాయ వృత్తి నైపుణ్యాలను పరిరక్షిస్తూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. విశ్వకర్మల కృషి, నైపుణ్యం, సేవలను గుర్తించి గౌరవించేందుకు ఇలాంటి వేడుకలు దోహదపడతాయని అన్నారు . భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ , సమాజ నిర్మాణం, అభివృద్ధిలో విశ్వకర్మల పాత్ర ఎంతో విశిష్టమైనదని అన్నారు. తమ నైపుణ్యం, శ్రమ, సృజనాత్మకతతో సమాజానికి సేవలందిస్తున్న విశ్వకర్మలు అభినందనీయులని తెలిపారు. ప్రాచీన కాలం నుంచి నిర్మాణాలు, కళలు, వివిధ చేతివృత్తుల అభివృద్ధిలో విశ్వకర్మల కృషి ఎంతో గొప్పదని పేర్కొన్నారు. విశ్వకర్మల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సంప్రదాయ వృత్తులను పరిరక్షిస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య మాట్లాడుతూ , సమాజ అభివృద్ధిలో విశ్వకర్మలు తరతరాలుగా అందిస్తున్న సేవలు, వారి వృత్తి నైపుణ్యం, కళా ప్రతిభ ఎంతో గొప్పవని అన్నారు. విశ్వకర్మలు తమ సంప్రదాయ వృత్తులను కొనసాగిస్తూ సమాజానికి అవసరమైన సేవలను అందిస్తున్నారని తెలిపారు. వారి నైపుణ్యాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వకర్మల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ సామాజిక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి విజయలక్ష్మి , జిల్లా అధికారులు, బి.సి. కమ్యూనిటి సంఘనాయకులు కాపర్తి వెంకటాచారి , వారాధి సత్యనారాయణ , నామోజు గోవిందా చారి , ఎలగందుల రామాచారి , అంబుల రామాచారి , బి. సాంబయ్య , ఎస్. కృష్ణమాచారి , పొడిచేటి వెంకటాచారి ప్రముఖులు, వివిధ వృత్తులకు చెందిన కళాకారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ