తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నరసాపురంలో భూ రీ సర్వే పరిశీలన. గురుకుల పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు రికార్డుల ఆధారంగా భూముల వివరాలను పక్కాగా నిర్ధారించాలి విద్యార్థుల భద్రత, ఆహార నాణ్యతలో రాజీ వద్దు ఫుడ్ పాయిజనింగ్‌కు తావులేకుండా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నపురెడ్డిపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం విస్తృతంగా పర్యటించి భూ రీ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు, గురుకుల విద్యాసంస్థల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా నరసాపురం గ్రామ పరిధిలో కొనసాగుతున్న భూ రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, అనంతరం అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల, తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను తనిఖీ చేసి భూ రీ సర్వే పురోగతి, విద్యార్థులకు అందుతున్న వసతులు, ఆహార నాణ్యత, పారిశుధ్యం, భద్రత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నరసాపురం గ్రామ పరిధిలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ అంకిత్, సర్వే సిబ్బంది, తహసీల్దార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ విస్తీర్ణం, గ్రామ సరిహద్దులు, పట్టా భూములు, వివిధ సర్వే నంబర్లకు సంబంధించిన వివరాలను రికార్డుల ఆధారంగా పరిశీలించారు. భూ రీ సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి సర్వే నంబర్‌కు సంబంధించిన విస్తీర్ణం, హక్కుదారు, సంబంధిత శాఖ వివరాలను రెవెన్యూ, సర్వే, అటవీ, ఇతర సంబంధిత శాఖల రికార్డులతో సమగ్రంగా సరిపోల్చి నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. గురుకుల విద్యాసంస్థల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం తొలగించాలని, పాములు, విషపూరిత జంతువులు ప్రవేశించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థుల మధ్య ఏవైనా సమస్యలు, వివాదాలు తలెత్తితే సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం కల్పిస్తున్న ప్రతి సౌకర్యం, పథకం పూర్తి స్థాయిలో వారికి అందేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ స్వర్ణ, ఆయా గురుకులాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సర్వే సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ