తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్‌లో జిల్లాలో ఇటీవల నమోదైన మాతృ మరణాలపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి, ఒక్క మాతృ మరణం కూడా జరగకుండా అన్ని స్థాయిల్లో అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. మాతృ మరణాల నివారణ కోసం ప్రతి కేసును శాస్త్రీయంగా విశ్లేషించి, లోపాలను గుర్తించి వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో ప్రతి మాతృ మరణ కేసును విడివిడిగా సమీక్షించి, మరణానికి దారితీసిన కారణాలు, గర్భధారణ సమయంలో అందించిన వైద్య సేవలు, రిఫరల్ వ్యవస్థ, అత్యవసర చికిత్స, రవాణా సౌకర్యం, ప్రసవానంతర సంరక్షణ తదితర అంశాలపై చర్చించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,ప్రతి గర్భిణీని అధిక ప్రమాద (High Risk Pregnancy) కేటగిరీలో ముందుగానే గుర్తించాలి.అవసరమైన పరీక్షలు, చికిత్సలు, ఫాలోఅప్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాలి.అత్యవసర పరిస్థితుల్లో రిఫరల్ ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలి.108 అంబులెన్స్ సేవలను సమర్థవంతంగా వినియోగించాలి.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి సేవలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారం రాథోడ్ మాట్లాడుతూ, జిల్లాలో మాతృ మరణాలను తగ్గించేందుకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. హైరిస్క్ గర్భిణీలను నిరంతరం పర్యవేక్షిస్తూ, సకాలంలో ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫర్ చేయడం, నాణ్యమైన ప్రసూతి సేవలు అందించడం, మాతృ మరణాలపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించడం ద్వారా మాతృ మరణాలను నివారించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, డీసీహెచ్‌ఎస్, గైనకాలజిస్టులు, సంబంధిత కార్యక్రమ అధికారులు, వైద్యాధికారులు మరియు ఇతర ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ