తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భూ రీసర్వే పనులను వేగవంతం చేయాలి. 22.84 లక్షల వ్యయంతో నాలుగు అధునాతన డీజీపీఎస్ రోవర్లు.70 గ్రామాల్లో కొనసాగుతున్న భూముల రీసర్వే – జిల్లా కలెక్టర్ అంకిత్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూముల రీసర్వే కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో సర్వే పనులు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. రీసర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేసి, కచ్చితత్వంతో భూ సర్వే పనులు నిర్వహించేందుకు రూ.22.84 లక్షల వ్యయంతో నాలుగు అధునాతన డీజీపీఎస్ (DGPS) రోవర్లను జిల్లాకు సమకూర్చినట్లు తెలిపారు.జిల్లాలో ఇప్పటికే 17 డీజీపీఎస్ రోవర్లు అందుబాటులో ఉన్నాయని, రీసర్వే పనులను మరింత వేగవంతం చేసేందుకు తాజాగా మరో నాలుగు రోవర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కలెక్టర్ తెలిపారు . జిల్లాలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన 70 గ్రామాల్లో లైసెన్సుడ్ సర్వేయర్ల ద్వారా భూముల రీసర్వే పనులు కొనసాగుతున్నాయని, సర్వే ప్రక్రియలో కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన నాలుగు డీజీపీఎస్ రోవర్లను వినియోగించనున్నట్లు తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భూముల కొలతలను కచ్చితత్వంతో చేపట్టడంతో పాటు సర్వే పనులను వేగంగా పూర్తి చేయడానికి ఈ పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు.ఈ సందర్భంగా బుధవారం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో లైసెన్సుడ్ సర్వేయర్లకు జిల్లా కలెక్టర్ అంకిత్ చేతుల మీదుగా నాలుగు డీజీపీఎస్ రోవర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వే పనుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని, నిర్దేశిత లక్ష్యాల మేరకు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సర్వేయర్లకు సూచించారు. భూ వివరాల నమోదు, భూముల కొలతలు, సరిహద్దుల నిర్ధారణ తదితర అంశాల్లో పూర్తి కచ్చితత్వంతో, పారదర్శకంగా సర్వే నిర్వహించాలని తెలిపారు. ప్రజలకు భూ సంబంధిత సమస్యలు తలెత్తకుండా రీసర్వే ప్రక్రియను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సర్వే ఏడీ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు, లైసెన్సుడ్ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ