తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తమ కొత్త బ్యాచ్ వైద్య విద్యార్థుల కోసం కాడావెరిక్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం ప్రతి వైద్య విద్యార్థి విద్యా ప్రయాణంలో ఒక విశిష్టమైన మైలురాయిగా నిలుస్తుంది. మానవ దేహం పట్ల గౌరవం, బాధ్యత మరియు వైద్య నైతికత పట్ల అవగాహనను పెంపొందించడంలో ఈ కార్యక్రమం ముఖ్య పాత్ర పోషిస్తుంది అని ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీహరిరావు అన్నారు. వైద్య విద్యా ప్రక్రియలో మానవ దేహం చేసిన అపారమైన సహకారాన్ని గుర్తుచేస్తూ, ఈ కార్యక్రమం భవిష్యత్ వైద్య నిపుణుల్లో మానవతా విలువలను నాటే ప్రేరణగా నిలిచింది. కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు సమిష్టిగా కాడావెరిక్ ప్రమాణం స్వీకరించి, శరీరదాతల దేహాలను అత్యున్నత గౌరవం, గాంభీర్యం మరియు సమగ్రతతో చూడాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా శరీరదాతల నిస్వార్థ సేవలకు గౌరవ సూచకంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉప ప్రిన్సిపల్ మాట్లాడుతూ, శరీర దానం యొక్క పరమార్థం మరియు మానవతా ప్రాధాన్యతను ప్రత్యేకంగా వివరించారు. శరీర దానం మానవత్వానికి చిహ్నమని, దాతలు సమాజానికి అందిస్తున్న ఈ నిబద్ధత వైద్య విద్యా అభివృద్ధికి మూలస్తంభమని పేర్కొన్నారు. కళాశాల వైద్య విద్యా పరిశోధనలకు తమ అమూల్య దేహదానం ద్వారా సహకరించిన దాతల కుటుంబాలకు కళాశాల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. ప్రజల్లో మానవతా సేవ పట్ల చైతన్యాన్ని పెంపొందించి, దేహదానం అనే మహోన్నత కర్మకు ప్రేరేపించడంలో సంస్థ అంకితభావంతో ఉందని ఉప ప్రిన్సిపల్ తెలిపారు. అదేవిధంగా, మా కళాశాలకు శరీర దానం కార్యక్రమంలో నిరంతర మద్దతు అందించిన ఝాన్సిరాణి కంటి మరియు శరీర దానం ట్రస్ట్‌కు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి అవగాహన కార్యక్రమాల ద్వారా కళాశాలకు శరీర దానాలు పెరిగి, వైద్య విద్యార్థులకు అనుభవాధారిత విద్యకు దోహదం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఓ డి అనాటమీ డాక్టర్ ప్రసన్న, వైద్య కళాశాల ఉపాధ్యాయులు సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ