తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్మికులపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలి.సింగరేణి వ్యాప్తంగా సుమారు 16 మంది జూనియర్ కెమిస్టుల డిప్యుటేషన్లపై ఏఐటీయూసీ అభ్యంతరం.అక్రమ డిప్యుటేషన్లు వెంటనే నిలిపివేయాలి..లేదంటే ఆందోళనకు సిద్ధం.సింగరేణి క్వాలిటీ విభాగంలో జూనియర్ కెమిస్టులకు ఇస్తున్న డిప్యుటేషన్లను వెంటనే నిలిపివేయాలని ఏఐటీయూసీ కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి జక్కుల గట్టయ్య డిమాండ్ చేశారు.సింగరేణి వ్యాప్తంగా సుమారు 16 మంది జూనియర్ కెమిస్టులను ఇతర ఏరియాలకు డిప్యుటేషన్‌పై పంపడం సరికాదని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.క్వాలిటీ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిని సరైన కారణాలు, సముచిత విధానాలు పాటించకుండా ఇతర ఏరియాలకు డిప్యుటేషన్‌పై పంపడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గట్టయ్య అన్నారు. ఒక ఉద్యోగిని మరో ప్రాంతానికి పంపిన అనంతరం ఏర్పడిన ఖాళీని భర్తీ చేయకుండా మిగిలిన సిబ్బందిపై అదనపు పని భారం మోపడం సమంజసం కాదన్నారు.డిప్యుటేషన్ల విషయంలో పారదర్శకమైన విధానాన్ని పాటించకుండా కొంతమందికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉద్యోగుల్లో నెలకొంటోందని గట్టయ్య పేర్కొన్నారు. తరచూ ఏరియాలు మార్చడం వల్ల ఉద్యోగుల కుటుంబ జీవనం, పిల్లల చదువులు తీవ్రంగా ప్రభావితమవుతాయని అన్నారు.ఇటీవల ఒక ఏరియా నుంచి మరో ఏరియాకు వచ్చిన ఉద్యోగులకు కనీసం నెల రోజులు కూడా పూర్తికాకముందే తిరిగి ఇతర ఏరియాలకు డిప్యుటేషన్ ఇవ్వడం వల్ల వారు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా డిప్యుటేషన్‌కు గురైన వారిలో మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారని, వారి కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు.ఒక జూనియర్ కెమిస్టు ఉద్యోగి స్థానాన్ని కాపాడే క్రమంలో ఇతర సిబ్బందిని డిప్యుటేషన్లకు గురిచేయడం సముచితమైన విధానం కాదని గట్టయ్య అన్నారు.ఉద్యోగులందరికీ సమానమైన నిబంధనలు, పారదర్శక విధానం అమలు చేయాలని యాజమాన్యాన్ని కోరారు.కార్మికులపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరించకుండా, డిప్యుటేషన్లపై పునఃసమీక్ష చేసి సమస్యను పరిష్కరించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. జూనియర్ కెమిస్టుల డిప్యుటేషన్లను వెంటనే నిలిపివేయకపోతే కార్మికుల పక్షాన ఆందోళన చేపట్టాల్సి వస్తుందని గట్టయ్య యాజమాన్యాన్ని హెచ్చరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ