తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణలో 70 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) భద్రాద్రి కొత్తగూడెం శాఖ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ నుంచి పోస్టాఫీసు వరకు ర్యాలీ మరియు నిరసన కార్యక్రమం నిర్వహించిన అనంతరం డా!! బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ABVP ప్రాంత కార్య సమితి సభ్యులు చావా ప్రణీత్ మాట్లాడుతూ, పాలిటెక్నిక్ కళాశాలలను ‘శక్తి’ (Young India Skills University) పరిధిలోకి తీసుకురావాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, దీనికి సంబంధించిన జీవో నెం.97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.పాలిటెక్నిక్ విద్య కేవలం నైపుణ్య శిక్షణకు పరిమితమైన వ్యవస్థ కాదని, పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నిపుణులను తయారు చేసే ప్రత్యేక సాంకేతిక విద్యా వ్యవస్థ అని అన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండే తక్కువ ఖర్చు సాంకేతిక విద్యకు పాలిటెక్నిక్ కళాశాలలు కీలక ఆధారంగా ఉన్నాయని పేర్కొన్నారు.పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేయాల్సిన సమయంలో విలీనం చేయడం సరైన నిర్ణయం కాదని అన్నారు. కళాశాలల్లో ఆధునిక ల్యాబ్‌లు, నూతన పరికరాలు, మెరుగైన మౌలిక వసతులు, సరిపడా బోధనా సిబ్బంది, పరిశ్రమలతో అనుసంధానమైన శిక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. డిప్లొమా విద్యార్థులకు ఉన్నత విద్యలో కొనసాగేందుకు ఉన్న లాటరల్ ఎంట్రీ అవకాశాలను మరింత బలోపేతం చేయాలని కోరారు.విద్యా వ్యవస్థలో ఇలాంటి కీలక మార్పులు తీసుకువచ్చే ముందు విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగ సంఘాలు, సాంకేతిక విద్యా నిపుణులతో ప్రభుత్వం విస్తృతంగా చర్చించాలని ప్రణీత్ అన్నారు.పాలిటెక్నిక్ విద్య పేద విద్యార్థుల ఇంజనీరింగ్ కలలకు బలమైన పునాది. ఈ వ్యవస్థను బలహీనపరిస్తే వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి జీవో నెం.97ను వెంటనే రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యను సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలి” అని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కొప్పుల శశిధర్, నగర ఉపాధ్యక్షులు దేవరపల్లి నిఖిల్, నగర సంయుక్త కార్యదర్శి ఓంకార్, చింటూ, వరుణ్, సంతోష్, రవి సుధన్ మరియు అధిక సంఖ్యలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ