తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే ఆదర్శ కేంద్రాలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు . మంగళవారం అన్నపురెడ్డిపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన, ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు అన్నపురెడ్డిపల్లి గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యా మరియు వైద్య సేవల అమలును సమగ్రంగా పరిశీలించారు. మొదటగా ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, మందుల గది, ప్రయోగశాల (ల్యాబ్), ఇన్‌పేషెంట్ విభాగం, స్టాక్ రిజిస్టర్, సిబ్బంది హాజరు రిజిస్టర్‌లను పరిశీలించారు. అవుట్‌పేషెంట్ రిజిస్టర్‌ను పరిశీలించి, రోజువారీగా వచ్చే రోగుల సంఖ్యపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అవుట్‌పేషెంట్ వార్డులో ఉన్న ఒక బాలుడితో మాట్లాడి, కుక్క కాటు టీకా కోసం వచ్చినట్లు తెలుసుకుని, టీకాలు అందుబాటులో ఉన్నాయా అని విచారించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఏ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారో, అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో ఉందా అనే అంశాలపై ఆరా తీశారు. తనిఖీ సమయంలో మెడికల్ అధికారి అందుబాటులో లేకపోవడంతో కారణాలను ప్రశ్నించగా క్షేత్రస్థాయిలో పర్యటనలో ఉన్నట్లు సిబ్బంది తెలిపారు, వెంటనే మెడికల్ అధికారిని పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది సిబ్బంది యూనిఫాం (ఆప్రాన్) ధరించకపోవడాన్ని గమనించి, విధి సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. సిబ్బంది డిప్యూటేషన్‌పై అధిక సంఖ్యలో విధులు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తించి, దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని ఆదేశించారు. అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. పదవ తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలిస్తూ, ఇటీవల జరిగిన ఇంగ్లీష్ పరీక్షపై విద్యార్థులను అడిగి తెలుసుకుని, రాబోయే గణిత పరీక్షకు క్రమబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు. ఉపాధ్యాయులు ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించి, సులభ పాఠాలను పునరావృతం చేయిస్తూ విద్యార్థులను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా అని తనిఖీ చేశారు. మెనూలో ఉన్న కొన్ని పదార్థాలు లేకపోవడంపై కారణాలు అడిగి తెలుసుకుని, వడ్డించిన ఆహారాన్ని తిని రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. వంటల్లో ఉప్పు అధికంగా ఉన్నట్లు గమనించి, సరిపడ మోతాదులో మాత్రమే వినియోగించాలని సూచించారు. విద్యార్థులకు పోషకాహారం అందించాలంటే మెనూ ప్రకారం అన్ని పదార్థాలు తప్పనిసరిగా వండాలని స్పష్టం చేశారు.
స్టోర్ రూమ్‌ను పరిశీలించి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, కూరగాయల నాణ్యతను తనిఖీ చేశారు. ఎండాకాలంలో కూరగాయలు త్వరగా పాడయ్యే అవకాశం ఉన్నందున తాజా, నాణ్యమైన కూరగాయలను మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. మెనూలో ఉన్న బీట్‌రూట్, పాలకూర అందుబాటులో లేకపోవడంపై ప్రశ్నించారు. కిచెన్ గార్డెన్ ఏర్పాటు గురించి విచారించి, ఆర్ ఓ ప్లాంట్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్‌ను శుభ్రత పనులకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలో ట్యాపుల లీకేజీ గమనించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , ప్రభుత్వ విద్యాసంస్థలు మరియు ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే ముఖ్య కేంద్రాలని తెలిపారు . విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం, పరిశుభ్ర వాతావరణం కల్పించడం అత్యవసరమని తెలిపారు. పదవ తరగతి విద్యార్థులు క్రమబద్ధంగా చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధించాలని, ఉపాధ్యాయులు వారికి సమగ్ర మార్గదర్శనం అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి రోగికి సమయానుకూలంగా వైద్య సేవలు, ఔషధాలు అందుబాటులో ఉండేలా చూడాలని, టీకాలు మరియు అత్యవసర మందులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను వేగంగా ఉన్నత స్థాయి ఆసుపత్రులకు తరలించేలా అంబులెన్స్ సేవలు సిద్ధంగా ఉండాలని, రిఫరల్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ పాటిస్తూ యూనిఫాం నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని, బాధ్యతాయుతంగా సేవలు అందించాలని హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన విద్యా, వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని, లోపాలు గుర్తించిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట మెడికల్ అధికారి ప్రియాంక, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ