తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రతి బీఎల్‌వో రోజుకు కనీసం 100 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేయాలి. ఓటరు జాబితాకు సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధం లేదని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి. 50 శాతం కంటే తక్కువ పురోగతి ఉన్న పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న సమయాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి ఓటర్ల వివరాల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.మంగళవారం హైదరాబాద్ నుంచి ఎస్‌ఐఆర్ కార్యక్రమం పురోగతి, ఓటర్ల వివరాల డిజిటలైజేషన్, ఎన్యూమరేషన్ ప్రక్రియ తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం (ఐడీఓసీ) నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అంకిత్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ప్రతి బూత్ స్థాయి అధికారి (బీఎల్‌వో) రోజుకు కనీసం 100 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేసే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. జూలై 15వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 లక్షల ఓటర్ల వివరాలు డిజిటలైజ్ కాగా, గత ఏడు రోజుల్లో కేవలం 22 లక్షల వివరాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయని, ఈ పురోగతి ఆశించిన స్థాయిలో లేదన్నారు. వచ్చే సమీక్షా సమావేశం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలనే లక్ష్యంతో అన్ని జిల్లాలు పనిచేయాలని ఆదేశించారు.పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో డిజిటలైజేషన్ పురోగతి చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టి, వచ్చే వారం గరిష్ఠ స్థాయిలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఓటరు జాబితా వివరాలను ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేస్తున్నారనే వదంతులను జిల్లా యంత్రాంగం వెంటనే ఖండించాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారంలో ఆధార్ నంబర్ ఇవ్వడం పూర్తిగా ఐచ్ఛికం మాత్రమేనని, బీఎల్‌వోలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార్ నంబర్ ఇవ్వాలని ఓటర్లపై ఒత్తిడి చేయరాదని స్పష్టం చేశారు.ఆన్‌లైన్‌లో ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన ఓటర్లను మళ్లీ ఆఫ్‌లైన్ ఫారం ఇవ్వాలని కోరడం అవసరం లేదన్నారు. కొన్ని పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొంటూ, ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా బీఎల్‌వోలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫారం నింపడంలో ఓటర్లకు అవసరమైన సహాయం అందించాలని, ఈ ప్రక్రియపై రూపొందించిన అవగాహన వీడియోలను విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని సూచించారు.కొంతమంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని, మరికొందరి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించబడ్డాయని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. అలాగే జీవించి ఉన్న కొంతమంది ఓటర్లను మరణించిన వారిగా నమోదు చేసిన ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయని, ఇలాంటి పొరపాట్లను వెంటనే గుర్తించి సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు.అధికారులందరూ తమ మొబైల్ నంబర్లను సంబంధిత వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నవీకరించుకోవాలని సూచించారు. 50 శాతం కంటే తక్కువ డిజిటలైజేషన్ పురోగతి ఉన్న పోలింగ్ స్టేషన్లను ప్రత్యేకంగా గుర్తించి అక్కడ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అంకిత్ మాట్లాడుతూ, జిల్లాలో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, సమయపాలనతో అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి బీఎల్‌వోకు రోజువారీ లక్ష్యాలను నిర్దేశించి, డిజిటలైజేషన్ పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. 50 శాతం కంటే తక్కువ పురోగతి ఉన్న పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా గుర్తించి అదనపు సిబ్బందితో పనులు వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఓటరు జాబితాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా బీఎల్‌వోలతో సహకరించి తమ వివరాలను సకాలంలో నమోదు చేసుకోవాలని అని తెలిపారు .ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, ఎంఎల్‌టీఓ సాయి కృష్ణ, ఎన్నికల సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ