తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టేకులపల్లి మండలం రోళ్ళపాడు గ్రామంలోని మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ పాఠశాల భవనం, ఆవరణ, తరగతి గదులు, పరిశుభ్రతా స్థితిని పరిశీలించారు. విద్యార్థులతో సూటిగా మాట్లాడి వారికి అందుతున్న విద్యా సౌకర్యాలు, పాఠశాలలో అందిస్తున్న మిడ్-డే మీల్ నాణ్యత, వసతుల గురించి తెలుసుకున్నారు. విద్యార్థుల పఠన, రచన నైపుణ్యాలను అంచనా వేసే క్రమంలో ఒకటవ తరగతి మరియు రెండవ తరగతి విద్యార్థులను బోర్డుపై వారి పేర్లు రాయమని సూచించి పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ – ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి ఆరోగ్యం, చదువు, అభివృద్ధి అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశాలని పేర్కొన్నారు. విద్యార్థులకు తగిన వసతులు, పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన ఆహారం అందించడంలో ఎలాంటి లోపం చోటు చేసుకోరాదని స్పష్టంచేశారు. ప్రతిరోజూ నిర్ణీత మెనూ అమలు అవుతున్నదో లేదో తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల హాజరు, బోధనా విధానాలను పరిశీలించిన కలెక్టర్ , అధికారులు తరచుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని, నిర్లక్ష్యం లేదా లోపం తలెత్తితే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఉపాధ్యాయులు చిట్టిబాబు, పంచాయతీ సెక్రటరీ రాజు మరియు గ్రామస్తులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ