తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మట్టి విగ్రహాలతోనే ప్రకృతికి మేలు కాలుష్య రహిత పండుగలు జరుపుకోవాలి ఆర్యవైశ్య మహాసభ కృషి అభినందనీయం : సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా లక్ష్మీదేవిపల్లి/కొత్తగూడెం : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, ప్రకృతిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్ష్మీదేవిపల్లి మండలం పరిధిలోని లక్ష్మీదేవిపల్లి, లోతువాగు గ్రామ పంచాయతీలలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య యువజన, మహిళా విభాగాల ఆధ్వర్యంలో ఆదివారం మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు తీవ్రంగా కలుషితమై జీవకోటికి ముప్పు వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వకాలం నుంచీ వస్తున్న సంప్రదాయాల ప్రకారం మట్టితో చేసిన విగ్రహాలనే పూజించి నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందని సూచించారు. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రకృతికి హాని కలగకుండా మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన ఆర్యవైశ్య మహాసభ, యువజన, మహిళా విభాగాల ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రజలంతా కాలుష్య రహిత పండుగలను జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దారా ధీరజ్, పాషా, బిల్లా, ఈసం రాములు, సంగం రవీందర్, నితిన్, శ్రీధర్, శ్రీకాంత్, అదర్ల శ్రీకాంత్, బోయిన శివ, బోయిన ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ