తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 14 ( తెలుగు వెలుగు ) : ఎక్కడపడితే అక్కడ ...తాగినోడుకి తాగినంత...కిరాణా షాపుల్లోనూ కావాల్సిన బ్రాండ్లు...ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మకాలు...చోద్యం చూస్తున్న అధికారులు...బెల్టు షాపులను అరికట్టండి... నిబంధనలు పాటించని దుకాణాలను నియంత్రించండి. ఎన్ హెచ్ ఆర్ సి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ మారెల్లి విజయ్ కుమార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని, లక్షల్లో మద్యాన్ని కొనుగోలు చేస్తున్న వ్యాపారులు అక్రమంగా కోట్ల రూపాయలకు పడగలెత్తేందుకు మాఫియాకు తెరలేపారని, ఎమ్మార్పీ కంటే అధిక ధరలతో అడ్డగోలుగా దందా చేస్తున్నారని, ఎన్ హెచ్ ఆర్ సి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ మారెల్లి విజయ్ కుమార్ ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరియు నియోజకవర్గంలో మద్యం షాపుల వ్యాపారులు సిండికేట్ తో విచ్చలవిడి అమ్మకాలకు తెర లేపారన్నారు. అధికారుల కనుసన్నల్లోనే 24 గంటల పాటు బెల్ట్ షాపులలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. ఓవైపు ప్రభుత్వ వైన్ షాపులలో మరో వైపు బెల్ట్ షాపులలో అధిక రేట్లకు మద్యం విక్రయాలు జరుగుతున్నా, ఎక్సైజు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీలు చేపట్టక పోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అధిక ధరలపై మద్యం ఆగడాలపై ఫిర్యాదు చేసేందుకు ఎవరైనా ఎక్సైజ్ కార్యాలయానికి వెళితే మాత్రం అక్కడ అధికారులు అందుబాటులో ఉండరని, కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగి ఎవరైనా మద్యం ఆగడాలపై ప్రశ్నిస్తే.. ‘నిజమా? మా దృష్టికి రాలేదే’.? అంటూ… అమాయకపు చూపులు చూడటం అధికారులకు పరిపాటిగా మారిందన్నారు. మండల కేంద్రంలో ఎక్కడపడితే అక్కడ తాగినోడుకి తాగినంత...మందు మస్తుగా దొరుకుతున్నదని, ఏ ఊర్లె చూసినా, ఏ సందులో చూసినా బెల్టుషాపులు పుట్టగొడుగుల్లెక్క వెలుస్తున్నాయన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా వాటిలో మద్యం బహిరంగంగా విక్రయిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడ చూసిన వైన్ షాప్ టు వయా బెల్టు షాప్ ల ఏజెన్సీలో అధిక ధరలతో అక్రమ దందా, మూడు పువ్వులు ఆరు కాయలుగా తేజరిల్లుతోందన్నారు. ఈ విషయంలో సంబంధిత ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందన్నారు. పట్టపగలే బెల్టు షాపులకు మద్యం తరలివెళ్తున్న, తెలిపినప్పటికీ, మద్యం అక్రమ విక్రయాల పట్ల ఎక్సైజ్ అధికారులు తమకేమీ పట్టవు అన్నట్టు గాఢ నిద్రలో మునిగి పోయారని విమర్శించారు. మరోవైపు బెల్ట్ షాపుల వల్ల మద్యపానం వినియోగం పెరగడమే కాకుండా నియంత్రణ లేని మద్యం అమ్మకాలతో అనేకమంది అప్పుల పాలవుతున్నారని, మహిళలు వేధింపులకు గురవుతారని,అల్లరి మూకలు పెట్రేగి పోతాన్నారని అందువల్ల బెల్ట్ షాపులను కట్టడి చేయాలన్నారు. ప్రజల ఫిర్యాదులకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి వీటిపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మద్యం అక్రమ దందాను నియంత్రించి, నిబంధనలను పాటించని వైన్ దుకాణాలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ