తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దుమ్ముగూడెం మండలంలోని బొజ్జి గుప్ప గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సందర్శించి పాఠశాల నిర్వహణ, బోధన ప్రమాణాలు, విద్యార్థుల నేర్పును సమగ్రంగా పరిశీలించారు. పర్యటనలో కలెక్టర్ తరగతి గదులు సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా స్థాయి, హాజరు, పాఠశాలలో అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కిషన్ షెడ్ ఆవరణలో పెంచుతున్న వివిధ రకాల మొక్కలను పరిశీలించి వాటి పరిరక్షణ మరియు సంరక్షణ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు స్వయంగా నిర్వహిస్తున్న ఈ చర్య పర్యావరణ పరిరక్షణలో భాగంగా చిన్నారుల్లో మంచి అలవాట్లను పెంపొందిస్తుందన్నారు. పాఠశాల ప్రాంగణంలోని పచ్చదనం, పర్యావరణ శుభ్రత పట్ల ఉపాధ్యాయులు చూపుతున్న శ్రద్ధను ఆయన అభినందించారు. అలాగే కలెక్టర్ విద్యార్థుల రీడింగ్ మరియు రైటింగ్ స్కిల్స్‌ను ప్రత్యేకంగా పరీక్షించి, వారు చదివే స్థాయి, అక్షరాల గుర్తింపు, వాక్య నిర్మాణం వంటి అంశాల్లో వారి సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులు పఠనంలో మరింత నైపుణ్యం సాధించేలా తరగతి గదుల్లో రోజువారీ రీడింగ్ యాక్టివిటీలను నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు రాయడం–చదవడం నైపుణ్యాలతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకునేలా పాఠశాలలో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. క్రీడలు మరియు ఆటలు విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి అత్యంత కీలకం అన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ విద్యార్థులను ప్రోత్సహించే భాగంగా వారికి నోట్‌బుక్స్, పెన్నులను అందజేసి, క్రమం తప్పకుండా చదువులో ముందుకు సాగాలని ప్రోత్సాహించారు. విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడిన ఆయన, ప్రతిరోజూ పాఠశాలకు హాజరై పాఠాలు నేర్చుకునే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ బుజ్జి గొప్ప గ్రామంలో గత సంవత్సరం ఏరు ఫెస్టివల్ లో భాగంగా చేపట్టిన విధంగానే గిరిజన సాంప్రదాయాలు ఆదివాసీల ఆవాసాలు, ఆహార అలవాట్లను బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు చేయాలని దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఉపాధ్యాయులు వసంతరావు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ