తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా లో ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించందుకు గాను ఆస్పత్రులపై నిరంతర పరిశీలన అవసరం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.బుధవారం ఐ డి ఓ సి కార్యాలయం కలెక్టర్ ఛాంబర్ నందుక్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు పురోగతిపై జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ వైద్యసంస్థల నమోదు, నిబంధనల అమలు, సేవల నాణ్యత మరియు ప్రజారోగ్య పరిరక్షణ అంశాలపై విస్తృతంగా చర్చ జరిపి, 46 ప్రైవేట్ ఆసుపత్రులకు శాశ్వత రిజిస్ట్రేషన్ మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ గారు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ పొందిన ఆసుపత్రులు ప్రభుత్వ నియమ నిబంధనలు, పరికరాల సక్రమ వాడకం, అర్హత కలిగిన వైద్య సిబ్బంది నియామకం, అత్యవసర సేవల అందుబాటు, పరిశుభ్రత ప్రమాణాలు వంటి అంశాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆసుపత్రులపై క్రమానుగత తనిఖీలు అత్యంత కీలకం అని తెలిపారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రులను ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా తనిఖీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తనిఖీల్లో ఎలాంటి నిర్లక్ష్యం, రికార్డు లోపాలు చోటుచేసుకుంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న మూఢనమ్మకాల ఆధారిత వైద్యపద్ధతులు ప్రజారోగ్యానికి ప్రమాదమని కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో, గ్రామాల్లో పనిచేసే వైద్యసిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించి, ప్రజల్లో శాస్త్రీయ వైద్యసేవలపై అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆరోగ్య విభాగం, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వైద్యాధికారులు సమన్వయంతో అవగాహన కార్యక్రమాలను బలపర్చాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ విద్యా చందన, ఐఎంఏ సెక్రటరీ & డి.ఎం.అండ్ హెచ్.ఓ డాక్టర్ తుకారాం రాథోడ్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బి. ప్రసాద్, డిప్యూటీ డెమో నాగలక్ష్మి, జూనియర్ అసిస్టెంట్ ఉమామహేశ్వరి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ