తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ???? ప్రజా భద్రత, రవాణా సౌకర్యాలే లక్ష్యంగా ప్రణాళికలు ???? రైల్వే శాఖ అనుమతులతో త్వరలోనే పనులు : కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రజల భద్రత, సాఫీగా రాకపోకలు సాగించేందుకు నియోజకవర్గ పరిధిలో రైల్వే వంతెనలు, గేట్ల నిర్మాణం అత్యంత ఆవశ్యకమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని పలు ప్రధాన ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, లెవల్ క్రాసింగ్‌లు, ఆర్వోబీ, ఆర్‌యూబీల మంజూరు కొరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌తో పాటు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించి నిరంతరం కృషి చేస్తున్నామని మంగళవారం ఆయన తెలిపారు. ఈ ప్రయత్నాల ఫలితంగా మంగళవారం రైల్వే ఏడీఈ రవి, జేఈ జావిద్, ఆర్ అండ్ బి ఈఈ నాగేశ్వరరావు సంబంధిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపారని పేర్కొన్నారు. బూడిదగడ్డ వద్ద వర్షాల సమయంలో ఎదురయ్యే ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారంగా కొత్త ఆర్‌యూబీ లేదా గేటు ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులను కోరినట్లు వెల్లడించారు. హేమచంద్రాపురం బైపాస్ రోడ్డుపై ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఆర్వోబీ, రైటర్ బస్తీ-గొల్లగూడెం మధ్య రవాణా సౌలభ్యం కోసం ఆర్‌యూబీ నిర్మాణాలను ప్రతిపాదించినట్లు వివరించారు. రామవరం-గరిమెళ్ళపాడు మధ్య సురక్షిత ప్రయాణానికి రైల్వే గేటు లేదా ఆర్‌యూబీ, అలాగే సింగరేణి మెయిన్ హాస్పిటల్ వద్ద రద్దీకి అనుగుణంగా ప్రస్తుత ఆర్వోబీ విస్తరణ పనులు త్వరలోనే పట్టాలెక్కేలా చర్యలు తీసుకుంటున్నామని, ఈ నాలుగు ప్రతిపాదనలకు త్వరలోనే మంజూరి లభించి నిధులు విడుదలవుతాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ