తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్మికుల హక్కుల కోసం పోరాడి.. అగ్రిమెంట్లు సాధించాం జనరల్ బాడీ సమావేశంలో వాసిరెడ్డి సీతారామయ్య,కొరిమి రాజ్ కుమార్,అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య. సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం ఏఐటీయూసీ సాగిస్తున్న పోరాటాలకు కార్మికుల నుంచి విశేష మద్దతు లభిస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్,అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య అన్నారు. కొత్తగూడెం, కార్పొరేట్, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 8 గంటలవారకు శేషగిరిభవన్‌లో జనరల్ బాడీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించబడింది. జూన్ 8న ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసు నేపథ్యంలో ఆర్‌ఎల్‌సీ సమక్షంలో సింగరేణి యాజమాన్యంతో నిర్వహించిన వరుస చర్చల ద్వారా 23 కీలక డిమాండ్లపై అగ్రిమెంట్లు సాధించామని సీతారామయ్య,రాజ్ కుమార్,మిరియాల రంగయ్య తెలిపారు. పెర్క్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్ యాజమాన్యం భరించడం, సర్వీసులో సహజ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహణ, 2025–26 వాస్తవ లాభాలను దసరాలోపు ప్రకటించేందుకు చర్యలు, బదిలీల్లో మూడేళ్ల నిబంధనకు బదులుగా ఖాళీల ఆధారంగా ఏడాది నిబంధన అమలు, అర్హులైన మైనింగ్ స్టాఫ్‌కు ఓవరన్ ప్రమోషన్లు వంటి పలు అంశాల్లో యాజమాన్యం అంగీకరించిందన్నారు.కార్మికుల వైద్య అవసరాల కోసం హైదరాబాద్‌లో సింగరేణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు, మెడికల్ అటెండెన్స్ నిబంధనల సవరణ, సర్వీసు నుంచి దిగిపోయిన కార్మికులకు ఓపీతో పాటు వారం రోజుల వరకు వైద్య సేవలు, సింగరేణి విద్యాసంస్థల్లో సీబీఎస్‌ఈ సిలబస్ అమలు, గనుల్లో సేఫ్టీ మెటీరియల్ సకాలంలో అందుబాటులో ఉంచడం వంటి అంశాలపై కూడా అంగీకారం సాధించామని వివరించారు.డిస్మిస్ కార్మికుల పెండింగ్ కేసులను హెచ్‌పీసీ కమిటీ ద్వారా పరిష్కరించడం, అర్హులైన మైనింగ్ స్టాఫ్‌కు సర్ఫేస్‌లో సూటబుల్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఈఎస్‌ఐ వైద్యం, పెండింగ్ డిపెండెంట్ ఉద్యోగాల పరిష్కారం, ఉద్యోగులకు ఈవెనింగ్ కాలేజీలకు ఎన్‌ఓసీలు, ఖాళీ పోస్టుల భర్తీ, క్యాడర్ స్కీమ్ సమస్యల పరిష్కారం వంటి అంశాలపై కూడా యాజమాన్యం సానుకూలంగా స్పందించిందన్నారు. మెడికల్‌గా ఫిట్ అయిన 149 మంది డిపెండెంట్లకు నెల రోజుల్లోపు ఆఫీస్ ఆర్డర్లు జారీ చేయాలని అంగీకారం కుదిరిందన్నారు. సొంత ఇంటి పథకంపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవడం, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించడం, చట్టబద్ధమైన సమ్మెల్లో పాల్గొనే కాంట్రాక్ట్ కార్మికులపై నో వర్క్–నో పే మాత్రమే అమలు చేసి అదనపు జరిమానాలు విధించకుండా చూడడం వంటి అంశాలపైనా అంగీకారం సాధించామని తెలిపారు.ప్రచారం కాదు.. పోరాటమే ఏఐటీయూసీ విధానం కార్మికుల సమస్యలను కేవలం ప్రకటనలకు పరిమితం చేయకుండా సమ్మె నోటీసు ఇచ్చి, ఆర్‌ఎల్‌సీ సమక్షంలో చర్చలు జరిపి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువచ్చి అగ్రిమెంట్లు సాధించామని సీతారామయ్య అన్నారు.ఏఐటీయూసీ సాధిస్తున్న విజయాలను చూసి ఓర్వలేక కొన్ని సంఘాలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.ఇతరుల పోరాట ఫలితాలను తమవిగా చెప్పుకోవడం సులభమే కానీ యాజమాన్యం ముందు నిలబడి కార్మికుల హక్కుల కోసం పోరాడి అగ్రిమెంట్లు సాధించడం అంత సులభం కాదన్నారు.అగ్రిమెంట్లు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలయ్యే వరకు ఏఐటీయూసీ పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.కార్మికులకు రావాల్సిన ప్రతి హక్కు, ప్రతి ప్రయోజనం అందే వరకు రాజీలేని పోరాటం కొనసాగిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, బ్రాంచ్ కార్యదర్శులు రమణమూర్తి, జక్కుల గట్టయ్య, సముద్రాల సుధాకర్, ఉపాధ్యక్షులు క్రిస్టోఫర్, కత్తెర్ల రాములు, భీమయ్య, సహాయ కార్యదర్శులు రాము, సూర్యప్రకాశ్, కాంట్రాక్ట్ వర్కర్స్ ఇన్‌చార్జి ఎర్రగాని కృష్ణయ్య, ఆఫీస్ బేరర్లు, అన్ని గనులు, డిపార్ట్‌మెంట్ల పిట్ సెక్రటరీలు, వివిధ కమిటీల నాయకులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ