తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డా. తుకారాం రాథోడ్ అధ్యక్షతన జిల్లా కుష్ఠు నిర్మూలన కార్యక్రమాల పై డిపిఎంఓలు (లెప్రసీ)మరియు హెల్త్ ఎడ్యుకేటర్ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ జిల్లాలో కుష్ఠు వ్యాధి నిర్మూలన కోసం చేపడుతున్న కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కుష్ఠు వ్యాధి అనుమానితులను త్వరితగతిన గుర్తించి పరీక్షలు నిర్వహించి, నిర్ధారణ అయిన వారికి వెంటనే మల్టీ డ్రగ్ థెరపీ (MDT) చికిత్స ప్రారంభించి పూర్తిస్థాయిలో పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఆరోగ్య కేంద్ర పరిధిలో యాక్టివ్ కేస్ సెర్చ్, కాంటాక్ట్ సర్వేలు, ఫాలోఅప్ పర్యవేక్షణను క్రమం తప్పకుండా నిర్వహించాలని తెలిపారు. కుష్ఠు వ్యాధి పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించేలా ప్రజలను చైతన్యపరచాలని హెల్త్ ఎడ్యుకేటర్లకు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చికిత్స, వైకల్య నివారణ చర్యలు, స్వీయ సంరక్షణ (Self Care) పద్ధతులపై విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. పాఠశాలలు, గ్రామ సభలు, స్వయం సహాయక సంఘాలు, గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య మరియు పోషణ కమిటీ సమావేశాల ద్వారా ఆరోగ్య విద్యను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అంతేకాకుండా ఐఈసీ (IEC) మరియు బీసీసీ (BCC) కార్యక్రమాలను బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో రికార్డులు, నివేదికలను సకాలంలో నవీకరించడం, నిర్దేశిత లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలలో చేతబడి, బాణమతి క్షుద్ర పూజలు మరియు మూఢనమ్మకాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావాలని ఆరోగ్య విద్యా బోధకులకు ఆదేశించారు ఈ సమావేశంలో Dr ప్రతాప్ ప్రోగ్రాం ఆఫీసర్, భద్రూ పీజీయోతెరపిస్ట్ , మోహన్, శ్రీనివాస్, హెల్త్ ఎడ్యుకేటర్లు జయలక్ష్మి, రమాదేవి ,బేబీ , వినయ్ కుమార్, బద్రు, ప్రతిభ, మరియు సంబంధిత జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ