తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించే విధంగా వేగవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనలతో కలిసి కలెక్టర్ ప్రజల వినతులను స్వయంగా స్వీకరించారు.జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించగా, వాటిని శ్రద్ధగా విన్న కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఎండార్స్ చేసి, తక్షణ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజావాణి లో స్వీకరించిన పలు దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదుపై శాఖాధిపతులు వ్యక్తిగత పర్యవేక్షణ చేపట్టి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్ లేకుండా నిర్ణీత గడువులో చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సమర్థవంతమైన పరిపాలన అందించడంలో అధికారులు కట్టుబడి ఉండాలని తెలిపారు.ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని దరఖాస్తులు క్రింది విధంగా ఉన్నాయి.భద్రాచలానికి చెందిన శేషగిరిరావు తనకు గతంలో 57%గా జారీ చేసిన సదరం సర్టిఫికెట్‌ను ప్రస్తుతం 2% తగ్గించారని, మళ్లీ 57% ప్రకారంగా సర్టిఫికెట్ మంజూరు చేయాలని కోరుతూ వినతి సమర్పించారు. దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డి.ఆర్.డీ.ఏ) అధికారులకు ఎండార్స్ చేశారు.అశ్వారావుపేట మండలానికి చెందిన ఊకే అరుణకుమారి తన తల్లి కె. ఆదిలక్ష్మి (లేట్), భర్త నాగేశ్వరరావు (లేట్) వారసురాలిగా 2 కుంటల పోడు వ్యవసాయ భూమికి పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయాలని కోరారు. ఈ విషయంపై తనకు మెమో జారీ అయి రైతుబంధు ప్రయోజనం కూడా లభించిందని, అయితే స్థానిక బ్యాంకు క్రాప్ లోన్ మంజూరుకు ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాదారు పాస్ పుస్తకం అవసరమని తెలియజేసిందని పేర్కొన్నారు. దీనిపై తగు పరిశీలన చేసి క్రాప్ లోన్ మంజూరు చేయుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి కలెక్టర్ ఎండార్స్ చేశారు.పాల్వంచ మండలం హమాలి కాలనీకి చెందిన మూడ్ శ్రీనివాస్ తాను పుట్టుకతోనే 89% అంగవైకల్యంతో బాధపడుతున్నానని, తన భార్య ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదని, కుటుంబ పోషణ కష్టసాధ్యంగా మారిందని, జీవనోపాధి అవకాశాన్ని కల్పించగలరని కోరారు. దీనిపై తగు చర్యల నిమిత్తం జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారులకు కలెక్టర్ ఎండార్స్ చేశారు.చర్ల మండలానికి చెందిన తడికల నాగరాజు తన కుమార్తె వివాహానికి కళ్యాణ లక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకోగా తిరస్కరించబడిందని, పునఃపరిశీలించి మంజూరు చేయాలని కోరుతూ వినతి సమర్పించారు. ఈ దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం భద్రాచలం సబ్ కలెక్టర్‌కు ఎండార్స్ చేశారు.భద్రాచలం జగదీష్ కాలనీకి చెందిన పుప్పాల రమేష్ తాను నిరుపేద దివ్యాంగుడినని, ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసం పూర్తి చేశానని, స్వయం ఉపాధి కోసం దివ్యాంగుల స్కూటీ మంజూరు చేయాలని వినతి సమర్పించారు. దీనిపై తగు చర్యల నిమిత్తం దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ