తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భూ రికార్డుల్లో పూర్తి స్పష్టత తీసుకురావాలి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి విధుల్లో నిర్లక్ష్యంపై ఆర్‌ఐ, ఎంపీడీవోపై చర్యలకు ఆదేశాలు దుమ్ముగూడెం మండలం మల్కానపల్లి, చిన్నబండిరేవు గ్రామాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయడంతో పాటు, పరస్పర సమన్వయంతో పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మల్కానపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి పరిశీలించారు. సుమారు 2 కిలోమీటర్లు అటవీ ప్రాంతం గుండా నడిచి క్షేత్రస్థాయిలో సర్వే పనుల పురోగతిని పరిశీలించారు. గ్రామ సరిహద్దులు, భూముల విస్తీర్ణం, ఎంజాయర్ల వివరాలు, పాత రెవెన్యూ రికార్డులు, క్షేత్రస్థాయి కొలతలు, రీ సర్వే పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సరిహద్దుల నిర్ధారణ పూర్తయినప్పటికీ రీ సర్వే ప్రక్రియ పెండింగ్‌లో ఉండటంపై కలెక్టర్ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పాత రికార్డులు, మ్యాప్‌లు, క్షేత్రస్థాయి కొలతలను సమన్వయం చేసి భూ రికార్డుల్లో పూర్తి స్పష్టత తీసుకురావాలని సూచించారు. సర్వే పరిధిలో సుమారు 120 మంది ఎంజాయర్లు ఉన్నట్లు అధికారులు వివరించగా, వారి సంఖ్య, భూ వివరాలు, పట్టాదారు పాసుపుస్తకాల పరిస్థితి, రీ సర్వే పురోగతిపై కలెక్టర్ సంబంధిత ఆర్‌ఐను ప్రశ్నించారు. అయితే ఆర్‌ఐ సరైన వివరాలను, ప్రాథమిక సమాచారాన్ని స్పష్టంగా అందించలేకపోవడంతో కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ రికార్డులు, సర్వే వివరాలపై క్షేత్రస్థాయి అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సంబంధిత ఆర్‌ఐపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాలకు సంబంధించిన పాత సర్వే రికార్డులు, సరిహద్దుల వివరాలను అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని రీ సర్వేను వేగవంతం చేయాలని సూచించారు. దుమ్ముగూడెం మండలంలో మొత్తం 8 గ్రామాల్లో భూ రీ సర్వే చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 5 గ్రామాల సరిహద్దుల నిర్ధారణ పూర్తికాగా, 3 గ్రామాల్లో గ్రామసభలు పూర్తయ్యాయని, లింగాపురం పరిధిలో సుమారు 250 ఎకరాల్లో రీ సర్వే జరుగుతున్నట్లు వివరించారు. మిగిలిన పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. మల్కానపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి, లబ్ధిదారుల వారీగా నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాల సంఖ్య, వారికి నిర్వహించిన సర్వే వివరాలను ఎంపీడీవో వివేక్ చంద్రను అడిగి తెలుసుకునే ప్రయత్నంలో సరైన సమాచారం అందించలేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం, సరైన సమాచారం అందించకపోవడంపై ఎంపీడీవోకు చార్జ్‌మెమో జారీ చేసి, 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనం అందేలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని నిరంతరం పర్యవేక్షించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. చిన్నబండిరేవు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల భవనాలు, తరగతి గదులు, వసతి గృహాలు, ఇతర మౌలిక వసతుల నిర్మాణ పురోగతిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి, భోజనం, క్రీడలు, ఇతర అవసరమైన సౌకర్యాలు సమగ్రంగా అందేలా క్యాంపస్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు, సాంకేతిక నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ అంకిత్ అన్నారు . ప్రతి అధికారి తన పరిధిలోని పనులపై పూర్తి అవగాహన కలిగి, క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ అశోక్ కుమార్, ఎంపీడీవో వివేక్ చంద్ర, ఆర్‌ఐ, సర్వే అధికారులు, రెవెన్యూ, గృహ నిర్మాణ, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ