తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం: వృత్తి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ పోతేనే యువత తమ భవిష్యత్తును అభివృద్ధి పథంలోకి తీసుకురాగలరని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.శనివారం ఐడీఓసీ (IDOC) కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో లెర్నెన్ ప్రైవేట్ లిమిటెడ్ వారిచే ఎంఆర్ఎఫ్ (MRF) ప్రైవేట్ లిమిటెడ్ వారి NAFS స్కీమ్ ద్వారా అప్రెంటిస్‌షిప్ శిక్షణతో పాటు, రేన్ (మద్రాస్) లిమిటెడ్ సంస్థ ద్వారా CNC మిషన్లపై అప్రెంటిస్‌షిప్ మరియు బ్యాచిలర్ / డిప్లొమా ఇన్–వోకేషనల్ కోర్సుల్లో రెండు సంవత్సరాల శిక్షణ కోసం నిర్వహించిన ఓరియెంటేషన్ & సెలక్షన్ ప్రోగ్రామ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. నైపుణ్యాలు ఉంటేనే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, యువతలో స్కిల్ డెవలప్‌మెంట్ పెంపొందించాలనే లక్ష్యంతోనే ఈ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ అప్రెంటిస్‌షిప్ శిక్షణలో ఉచిత శిక్షణతో పాటు స్టైపెండ్ సౌకర్యం, 100 శాతం ప్లేస్‌మెంట్ సపోర్ట్ అందిస్తున్నట్లు వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మల్టీ స్కిల్స్ అవసరమని, యువత నిరంతరం నేర్చుకునే దృక్పథాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. యువత తమ లక్ష్యాలను సాధించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.ఈ నేపథ్యంలో తన చిన్ననాటి అనుభవాలను కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. తాను పేద కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగానని తెలిపారు. తన తండ్రి ఐటీఐ చదివారని, కుటుంబంలో పెద్దగా చదువుకున్న వారు ఎవరూ లేరని అన్నారు. తాను ఈ స్థితికి చేరుకోవడానికి ఎన్నో పనులు చేశానని, ఎంతో కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకున్నానని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయని, వాటికి భయపడి ఒకేచోట కూర్చుంటే విజయం దక్కదని అన్నారు. కష్టాలను అధిగమించి ఓర్పుతో ముందుకు వెళ్లిన వారే విజయతీరానికి చేరుకుంటారని పేర్కొన్నారు. ఈ అప్రెంటిస్‌షిప్‌లో మంచిగా శిక్షణ తీసుకొని, యువత ఉద్యోగాలను సాధించి జిల్లాకు, తమ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ సెలక్షన్ ప్రోగ్రామ్‌కు హాజరుకాలేకపోయిన అభ్యర్థుల కోసం జనవరి 21న మరోసారి ట్రైనింగ్ & సెలక్షన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సెలక్షన్‌లో ఎంపిక కాలేకపోయినా అభ్యర్థులు నిరాశ చెందకుండా, మరింతగా ప్రిపేర్ అయి భవిష్యత్తులో ఇంకా మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమానికి మొత్తం 107 మంది యువకులు హాజరుకాగా, వీరిలో 92 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారని తెలిపారు. నమోదు చేసుకున్న అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించి, వారిలో 57 మందిని వివిధ ప్రతిష్ఠాత్మక పరిశ్రమలకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఇందులో MRF Ltd. కంపెనీకి 39 మంది, Rane (Madras) Limited కంపెనీకి 14 మంది,టైచి కంపెనీకి 4 మంది యువకులు ఎంపికయ్యారని తెలిపారు.MRF కంపెనీలో శిక్షణ కాలంలో మొదటి సంవత్సరంలో నెలకు రూ.17,500, రెండో సంవత్సరంలో రూ.18,500, మూడో సంవత్సరంలో రూ.19,500 స్టైపెండ్ అందజేయబడుతుందని తెలిపారు. ఇందులో వసతి సౌకర్యం కోసం రూ.1,000, క్యాంటీన్ సదుపాయం కోసం రూ.350, బస్ సౌకర్యం కోసం రూ.500గా మొత్తం రూ.1,850 మినహాయించి మిగిలిన మొత్తాన్ని స్టైపెండ్ రూపంలో యువతకు చెల్లించబడుతుందని వివరించారు.రానే (మద్రాస్) కంపెనీ వారు శిక్షణ కాలంలో మొదటి సంవత్సరంలో నెలకు రూ.15,200, రెండో సంవత్సరంలో రూ.16,200 స్టైపెండ్ అందజేస్తారని, శిక్షణ పూర్తయిన అనంతరం ఎంపికైన యువతకు ప్రారంభ జీతంగా నెలకు రూ.22,000 చెల్లించబడుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో MRF కంపెనీ సూపర్‌వైజర్ అమృత్ రాజు, రానే మద్రాస్ కంపెనీ నుండి రిక్రూట్‌మెంట్ – అసిస్టెంట్ మేనేజర్ బిస్వజిట్ ఖుంటియా, SERP నుండి బి.నీలయ్య, ఏపిఎం లు ఎల్.వెంకయ్య, జి. ప్రసాద్ రెడ్డి, ఏ. నాగేశ్వర రావు, ఈ.డి.యం కలెక్టరేట్ టెక్నికల్ విభాగం అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ