తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ట్రెక్కింగ్ చేయడం ద్వారా యువతలో శారీరక ఆరోగ్యం, క్రమశిక్షణతో పాటు ప్రకృతి పట్ల బాధ్యతాభావం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. జిల్లాలో “ఏరు ఫెస్టివల్” కార్యక్రమంలో భాగంగా బుధవారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస నగర్‌లో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం గుట్టపై ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్‌తో పాటు ట్రైనీ కలెక్టర్ సౌరబ్ స్వయంగా పాల్గొని గుట్టపై కొంత దూరం వరకు ట్రెక్కింగ్ చేశారు. ట్రెక్కింగ్ సమయంలో పరిసర ప్రాంతాల్లోని అటవీ సంపద, సహజ ప్రకృతి అందాలను పరిశీలిస్తూ యువతతో కలిసి ఉత్సాహంగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అనంతరం గుట్టపై ఉన్న హిల్ వ్యూ పాయింట్‌ను సందర్శించి అక్కడి నుంచి పాల్వంచ పట్టణాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని సహజ దృశ్యాలు, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతపై అధికారులు యువతతో చర్చించారు.అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ పరిసరాల పరిశుభ్రత, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆలయ బాధ్యులతో వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పాల్వంచ ప్రాంతంలో ఇలాంటి ప్రకృతి సౌందర్యంతో కూడిన పర్యాటక ప్రాంతాలు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండటం గర్వకారణమని తెలిపారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రకృతికి దగ్గరగా ఉల్లాసంగా గడపడానికి ఇది అత్యంత అనుకూలమైన ప్రదేశమని అన్నారు. యువత, విద్యార్థులు ఇలాంటి ట్రెక్కింగ్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వం పెరగడమే కాకుండా ప్రకృతి సంరక్షణపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. జిల్లాలో ప్రకృతి ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు “ఏరు ఫెస్టివల్” ద్వారా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పర్యాటక అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి యం. పరంధామ రెడ్డి, తహసీల్దార్లు దుర్గాప్రసాద్, భగవాన్ రెడ్డి, ఆలయ బాధ్యులు కొత్త వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, TNGO ప్రతినిధి చైతన్య భార్గవ్, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ మహిధర్, కోచ్‌లు నాగేంద్ర, కల్యాణ్ (ఆర్చరీ), నబీ (రైఫిల్ షూటింగ్), రమేశ్ (టైక్వాండో), వివిధ క్రీడాకారులు, ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల పాల్వంచ ప్రిన్సిపల్ అనురాధ, PD శ్వేత, విద్యార్థులు, NCC, NSS వాలంటీర్లు, ఆలయ సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ