తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 42 బ్లాక్ స్పాట్ల వద్ద భద్రతా చర్యలు వేగవంతం చేయాలి.జనవరి నుంచి ఆగస్టు వరకు 349 ప్రమాదాలు 164 మంది మృతి.జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, ప్రమాదాలకు గల కారణాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా విశ్లేషించి, ప్రమాదాల పునరావృతిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, అధికారులు, వాహనదారులు, ప్రజలు సమష్టిగా బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలమని ఆయన అన్నారు.ఐడీఓసీ కార్యాలయం అదనపు కలెక్టర్ ఛాంబర్ నందు నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశంలో జిల్లాలో నమోదైన రోడ్డు ప్రమాదాలు, వాటికి దారితీస్తున్న కారణాలు, ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలు, బ్లాక్ స్పాట్ల వద్ద చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు 42 బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో గతంలో జరిగిన ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి, అవసరమైన ఇంజినీరింగ్, రహదారి భద్రతా చర్యలను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని సూచించారు.జిల్లాలో జనవరి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు మొత్తం 349 రోడ్డు ప్రమాదాలు నమోదై 164 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు సమావేశంలో వివరించారు. ఒక్క ఆగస్టు నెలలోనే 36 రోడ్డు ప్రమాదాలు జరగగా 14 మంది మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాదాల సంఖ్య, తీవ్రతను తగ్గించే విధంగా ప్రమాదాలకు గల ప్రధాన కారణాలను గుర్తించి, వాటి నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.రహదారులపై పశువుల సంచారం, ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాలకు కారణమవుతున్నందున పశువులను రహదారులపైకి వదిలే యజమానులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. అతివేగం, మైనర్లకు వాహనాలు అప్పగించడం, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగించకపోవడం వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలతో పాటు కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.గుర్తించిన 42 బ్లాక్ స్పాట్ల వద్ద హెచ్చరికలు, సూచిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, రహదారి మార్కింగ్ తదితర భద్రతా ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేపట్టాలని, అవసరమైన ప్రాంతాల్లో అదనపు రహదారి భద్రతా సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు. బ్లాక్ స్పాట్ల వద్ద చేపట్టిన పనుల పురోగతిని సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రహదారులపై ఏర్పడిన గుంతలను తక్షణమే పూడ్చివేయడంతో పాటు, రహదారుల ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలను ఎప్పటికప్పుడు తొలగించి వాహనదారులకు స్పష్టమైన దృశ్యమానత కల్పించాలని సూచించారు.జాతీయ రహదారులపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలను వెంటనే చేపట్టాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు గోల్డెన్ అవర్‌లో అత్యవసర వైద్య సేవలు అందేలా బ్లాక్ స్పాట్లకు సమీపంలోని ఆసుపత్రులను మ్యాపింగ్ చేయాలని, అంబులెన్స్ సేవలు వేగంగా అందుబాటులోకి వచ్చేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేసి నవీకరించాలని తెలిపారు.రోడ్డు ప్రమాదాలు కేవలం ఒక శాఖకు సంబంధించిన అంశం కాదని, రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. ప్రమాదాలకు గల కారణాలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం, ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంచడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని ఆయన సూచించారు.ఈ సమావేశంలో జిల్లా రవాణా అధికారి వెంకటరమణ, జిల్లా పంచాయతీ అధికారి అనూష, జిల్లా ఇంటర్మీడియట్ శాఖాధికారి వెంకటేశ్వర్లు, ఆర్‌అండ్‌బీ ఈఈ నాగేశ్వరరావు, కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్‌ఐ గడ్డం ప్రవీణ్ కుమార్, ఐఆర్‌ఏడీ జిల్లా మేనేజర్ బాలాజీ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ