తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఫలించిన ఎమ్మెల్యే కూనంనేని కృషి.కొత్తగూడెంకు నైపుణ్యాభివృద్ధి కేంద్రం మంజూరు.రూ.10కోట్ల రూపాయల నిధులు మంజూరు. ఏడాదికి వెయ్యి మంది యువతకు శిక్షణ.మూడు ఎకరాల స్థలంలో భవన నిర్మాణం.ముఖ్యమంత్రి, ఆర్ అండ్ బి మంత్రికి ధన్యవాదాలు. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ (నైపుణ్యాభివృద్ధి కేంద్రం) భవన నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఉత్తర్వులు జారీ చేసిందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. శుక్రవారం అయన ఇందుకు సంబందించిన వివరాలు వెల్లండించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఈ శిక్షణ కేంద్రం ఏర్పాటు కోసం శుక్రవారం ప్రభుత్వం జీవో నెంబర్ 398 ద్వారా మొదటి విడతగా రూ.10కోట్ల నిధులను మంజూరు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ నియోజకవర్గ యువతకు ఎంతో ప్రయోజనకరంగా మారనున్న ఈ భవనాన్ని మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు ఆయన వివరించారు. ఈ శిక్షణ కేంద్రం అందుబాటులోకి వస్తే ఏడాదికి వెయ్యి మంది నిరుద్యోగ యువతీ యువకులు వివిధ రకాల వృత్తి నైపుణ్యాలలో శిక్షణ పొందే అద్భుతమైన అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి పర్యవేక్షణ ఛార్జీలు లేకుండా ఈ నిర్మాణ పనులను రోడ్లు, భవనాల శాఖ ద్వారానే పూర్తి చేయించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఇందుకు సంబంధించిన నిధులను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కార్పస్ ఫండ్ నుండి భరిస్తారని ఆయన స్పష్టం చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి, యువత ఉపాధికి ఎంతో తోడ్పడే ఈ కేంద్రాన్ని మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు, రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ