తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్రంలో ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపుగా భూధార్ యూనిక్ నంబర్ కేటాయించే లక్ష్యంతో చేపడుతున్న భూముల రీ సర్వేను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భూముల రీ సర్వే, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం, సర్వేయర్ల శిక్షణ, సాంకేతిక ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ, మొదటి దశలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి రీ సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. DGPS, రోవర్స్, GIS సాంకేతికతను వినియోగించి ప్రతి భూమి సరిహద్దులను ఖచ్చితంగా నిర్ధారించి, ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపుగా భూధార్ యూనిక్ నంబర్ కేటాయిస్తామని చెప్పారు. రీ సర్వే ప్రారంభానికి ముందు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, రైతులు, భూ యజమానులకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. సర్వేయర్లకు సమగ్ర శిక్షణ ఇచ్చిన అనంతరమే రీ సర్వేను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అలాగే భూ భారతి కింద అందుతున్న దరఖాస్తులు 60 రోజులకు మించి పెండింగ్‌లో ఉండకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన రెవెన్యూ సేవలు అందేలా అన్ని జిల్లాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఐ డి ఓ సి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, జిల్లాలో రీ సర్వేను ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సమర్థవంతంగా అమలు చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడతామని తెలిపారు. గ్రామస్థాయిలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి, రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. భూ భారతి వెబ్‌సైట్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లిన కలెక్టర్ అంకిత్, వాటి పరిష్కారానికి తగిన సాంకేతిక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వెబ్‌సైట్ సమస్యలు పరిష్కారమైతే దరఖాస్తుల పరిశీలన మరింత వేగవంతమై, ప్రజలకు సేవలు సకాలంలో అందుతాయని వివరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ