తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి పట్టభద్రుల గొంతుకను శాసనమండలిలో బలంగా వినిపించేందుకు, అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించేందుకు జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం సమీపంలో పట్టభద్రుల శాసనమండలి ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ జనసేన అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కొత్తగూడెం నియోజకవర్గ ఎంఎల్‌సీ కోఆర్డినేటర్లు తనూజ రెడ్డి, వినయ్ విప్లవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అర్హులైన పట్టభద్రుల నుంచి అవసరమైన ధ్రువపత్రాలను సేకరించి, ఆన్‌లైన్ ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తులు సమర్పించారు. పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడం ద్వారా తమకు లభించిన ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలని జనసేన నాయకులు సూచించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమని, అర్హత ఉన్నప్పటికీ నిర్లక్ష్యం కారణంగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోకపోతే ఎన్నికల్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ముందుకు వచ్చి నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, విద్యా రంగానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం కావాలంటే జనసేన తరపున బరిలో నిలిచిన డాక్టర్ గడల శ్రీనివాస రావు ను గెలిపించాలని, అందుకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమిష్టిగా కృషి చేయాలని, ఓటరు నమోదు విషయంలో యువత, ఉద్యోగులు, ఇతర అర్హులైన పట్టభద్రులకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య నాయకులు ఎం.డి. సాధిక్ పాషా, సాయి అనిత్, బాలకృష్ణ, వనమా రాము, రమేష్, సురేష్, తులసి రామ్, వీర మహిళలు కుమ్మరి సౌజన్య, తమ్మ మౌనికతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ