తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ఆధార్ సేవలు మరింత చేరువ. నూతన ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్. రోజుకు 300–400 మందికి సేవలు.ఆన్‌లైన్‌లో ముందస్తు టోకెన్ బుకింగ్ సదుపాయం.కొత్తగూడెం పట్టణంలోని పాత కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కేంద్రంలోని వివిధ విభాగాలను పరిశీలించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన సదుపాయాలు, ఆధార్ సేవల నిర్వహణకు ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, సాంకేతిక పరికరాలు తదితర వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, రోజువారీగా ఎంతమందికి సేవలు అందించగల సామర్థ్యం ఉంది, ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ చర్చించారు.ఆధార్ సేవా కేంద్రం ద్వారా ప్రజలకు కొత్తగా ఆధార్ నమోదు చేయడం, ఆధార్‌లోని వివరాల సవరణ, చిరునామా మార్పు, మొబైల్ నంబర్ అనుసంధానం తదితర ఆధార్ సంబంధిత సేవలను అందించనున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రం ద్వారా రోజుకు సుమారు 300 నుంచి 400 మంది వరకు ప్రజలకు ఆధార్ సేవలు అందించే సామర్థ్యం ఉందని తెలిపారు. దీంతో కొత్తగూడెం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఆధార్ సేవలు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు .ఆధార్ సేవలు పొందేందుకు ప్రజలకు ఆన్‌లైన్‌లో ముందస్తు టోకెన్ బుకింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు ముందుగానే ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ తీసుకుని నిర్ణీత సమయంలో ఆధార్ సేవా కేంద్రానికి రావడం ద్వారా తమ సమయాన్ని ఆదా చేసుకోవచ్చని సూచించారు. ఆన్‌లైన్ టోకెన్ బుకింగ్ కోసం UIDAI అధికారిక అపాయింట్‌మెంట్ వెబ్‌సైట్‌ను https://appointments.uidai.gov.in/bookappointment.aspx ద్వారా వినియోగించుకోవచ్చని తెలిపారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ఆధార్ ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రంగా మారిందని, అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్ తదితర అవసరాలకు ఆధార్ అవసరమవుతున్న నేపథ్యంలో ప్రజలకు ఆధార్ సేవలు సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. కొత్తగూడెంలో నూతన ఆధార్ సేవా కేంద్రం అందుబాటులోకి రావడం ద్వారా జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.ఆధార్ సేవల కోసం జిల్లా ప్రజలు హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కొత్తగూడెంలోనే సేవలు పొందే అవకాశం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు . గతంలో ఆధార్‌కు సంబంధించిన వివిధ సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లడం వల్ల ప్రజలకు ప్రయాణ సమయం, ఖర్చులు పెరిగేవని, ప్రస్తుతం స్థానికంగానే ఆధార్ సేవలు అందుబాటులోకి రావడంతో ఆ ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. ఆధార్‌కు సంబంధించిన సేవల కోసం ప్రజలు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కేంద్రానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలను క్రమబద్ధంగా, పారదర్శకంగా, వేగవంతంగా అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ముందస్తు టోకెన్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలు ఎక్కువ సమయం వేచి ఉండకుండా చూడాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, చిన్నారులతో వచ్చే తల్లిదండ్రులు తదితరులకు అవసరమైన సహకారం అందించాలని తెలిపారు. ఆధార్ సేవల కోసం వచ్చే ప్రజలకు అవసరమైన పత్రాలు, సేవల విధానం తదితర అంశాలపై స్పష్టమైన సమాచారం అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజలు మధ్యవర్తులను ఆశ్రయించకుండా అధికారిక ఆధార్ సేవా కేంద్రం ద్వారా సేవలను పొందాలని కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర UIDAI రీజినల్ కార్యాలయం, హైదరాబాద్ ప్రాజెక్ట్ మేనేజర్ నరేష్ చంద్ర, BLS International Services Ltd. రీజినల్ మేనేజర్ శ్రీనివాస్, భద్రాద్రి కొత్తగూడెం ఆధార్ సేవా కేంద్రం ఆపరేషనల్ మేనేజర్ వంశీ, కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్య, e-District Manager సైదేశ్వరరావు , TSTS జిల్లా మేనేజర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ