తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అక్రమ ఇసుక, పశు రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి.పెట్రోలింగ్, బ్లూ కోట్స్ వాహనాలతో నిరంతరం సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.వార్షిక తనిఖీలలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం విధుల్లో ఉన్న సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపే విధంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. వివిధ వర్టికల్స్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు. గ్రేవ్, ప్రాపర్టీ, దొంగతనం కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నిందితులను త్వరగా గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు చోరీకి గురైన ఆస్తిని రికవరీ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా అక్రమ పశు రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. కేసుల దర్యాప్తులో భాగంగా గత నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని, యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా గ్రామాలు, విద్యాసంస్థల్లో విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పెట్రోలింగ్ వాహనాలు, బ్లూ కోట్స్ వాహనాల్లో నిరంతరం సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని తక్షణమే స్పందించాలని సూచించారు.పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులను పరిశీలించిన అనంతరం పోలీసింగ్ వెబ్ అప్లికేషన్లపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీసీటీఎన్ఎస్ 2.0లో కేసుల వివరాలను సక్రమంగా నమోదు చేయడంతో పాటు సీఐఆర్ పోర్టల్, ఈ సాక్ష, నాట్ గ్రిడ్, గాండీవ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా నేరాల దర్యాప్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని తెలిపారు. సైబర్ మోసాల పట్ల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.అనంతరం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఐ శ్రీలక్ష్మి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ విజయసింహారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ