తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏఐటీయూసీ పోరాటంతో కార్మికులకు కీలక ప్రయోజనాలు - కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి. కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసు, ఆర్‌ఎల్‌సీ సమక్షంలో జరిగిన చర్చలు, నిరంతర పోరాటం ఫలితంగా సింగరేణి యాజమాన్యం పలు కీలక డిమాండ్లపై అంగీకారం తెలిపిందని ఏఐటీయూసీ కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.వి. రమణమూర్తి తెలిపారు. గురువారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.జూన్ 8న ఏఐటీయూసీ సమ్మె నోటీసు ఇచ్చిందని, అనంతరం యాజమాన్యంతో పలుమార్లు చర్చలు జరిపినా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటాన్ని కొనసాగించామని తెలిపారు.ఏఐటీయూసీ ఒత్తిడితో కార్మికులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగించే పలు అంశాలపై అగ్రిమెంట్లు జరిగాయన్నారు.ప్రధానంగా పెర్క్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్‌ను యాజమాన్యమే భరించడం, సర్వీసులో సహజ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం, 2025–26 వాస్తవ లాభాల ప్రకటన, ట్రాన్స్‌ఫర్ల మూడేళ్ల నిబంధనలో మార్పు, అర్హులైన మైనింగ్ స్టాఫ్, మైనింగ్ సర్దార్లకు ఓవర్‌మెన్ ప్రమోషన్లు వంటి అంశాలపై అంగీకారాలు సాధించామని పేర్కొన్నారు.అలాగే హైదరాబాద్‌లో సింగరేణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్ అటెండెన్స్ నిబంధనల్లో మార్పులు, సింగరేణి విద్యాసంస్థల్లో సీబీఎస్‌ఈ సిలబస్, కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్‌ఐ సదుపాయం కల్పించే అంశాలపై కూడా అంగీకారం కుదిరిందన్నారు. ఖాళీ పోస్టుల భర్తీ, క్యాడర్ స్కీమ్ సమస్యల పరిష్కారం, మెడికల్ ఫిట్ అయిన 149 మంది డిపెండెంట్లకు నెలలోపు ఆఫీస్ ఆర్డర్లు జారీ చేయడం, సొంత ఇంటి పథకం, సేఫ్టీ మెటీరియల్ సరఫరా, సూటబుల్ సర్ఫేస్ ఉద్యోగాలు తదితర అంశాలపై కూడా యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని తెలిపారు.కొత్త గనులతోనే సింగరేణి భవిష్యత్తు సింగరేణి సంస్థ అభివృద్ధికి రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని, కొత్త బొగ్గు గనులు కేటాయించే విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని రమణమూర్తి కోరారు. బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి చురుగ్గా పాల్గొని కొత్త బ్లాకులు సంస్థకు దక్కేలా చర్యలు తీసుకోవాలన్నారు.కొత్త గనులు,ఉపాధి అవకాశాలు, కార్మిక సంక్షేమం,ఉద్యోగ భద్రతతోనే సింగరేణి భవిష్యత్తు బలోపేతమవుతుందన్నారు.కార్మికుల సమస్యలను ప్రచారానికే పరిమితం చేయకుండా పోరాటాల ద్వారా పరిష్కారాలు సాధించడమే ఏఐటీయూసీ విధానమని స్పష్టం చేశారు.ఏఐటీయూసీ సాధిస్తున్న విజయాలను కొన్ని సంఘాలు ఓర్వలేక విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు.సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని రమణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు క్రిస్టోఫర్, సహాయ కార్యదర్శి రాము, ఆఫీస్ బ్యారర్స్ నితిన్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ