తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గిరిజనుల హక్కులను కాపాడుతూ.. అటవీని సంరక్షించాలి.అంబాసత్రం భూమిని గుర్తించి 15 రోజుల్లో స్పష్టతకు చర్యలు.అటవీ–రెవెన్యూ భూ సమస్యలకు సమగ్ర సర్వేతో పరిష్కారం చూపాలి: జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్.లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టి పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కూనారం గ్రామంలో అటవీ–రెవెన్యూ భూములకు సంబంధించిన సమస్యలపై జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్‌కు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో సోమవారం కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ క్షేత్రస్థాయిలో పర్యటించి భూ పరిస్థితులను పరిశీలించారు. అనంతరం గిరిజనులు, స్థానిక ప్రజలు, రెవెన్యూ, అటవీ, సర్వే శాఖల అధికారులతో పబ్లిక్ హియరింగ్ నిర్వహించి సమస్యకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జాటోత్ హుస్సేన్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలించకుండా భూ సమస్యలపై తుది నిర్ణయానికి రావడం సరికాదన్నారు. రెవెన్యూ, అటవీ శాఖల రికార్డులు, వాదనల్లో భిన్నతలు ఉన్న నేపథ్యంలో గతంలో నిర్వహించిన సర్వేలు, జాయింట్ సర్వే నివేదికలు, సంబంధిత రికార్డులను సమగ్రంగా పరిశీలించి వాస్తవ పరిస్థితిని నిర్ధారించాలని సూచించారు. పాత సర్వేకు, తాజా జాయింట్ సర్వేకు మధ్య తేడాలు ఎందుకు వచ్చాయో స్పష్టంగా తేల్చాలన్నారు.అంబాసత్రం భూమికి సంబంధించిన అంశంపై కూడా స్పష్టత తీసుకురావాలని కమిషన్ సభ్యులు సూచించారు. గతంలో సుమారు 250 ఎకరాలకు పైగా అంబాసత్రం భూమి ఉన్నట్లు అధికారులు విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రస్తుతం ఆ భూమి రికార్డుల్లో స్పష్టంగా కనిపించకపోవడానికి కారణాలను పరిశీలించాలన్నారు. అంబాసత్రం భూమి ఎక్కడ ఉందో గుర్తించి, ఓవర్‌ల్యాప్ అయిన ప్రాంతాలను కూడా మరోసారి సమగ్రంగా సర్వే చేయాలని సూచించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి 15 రోజుల్లో ప్రాథమిక స్పష్టతకు చర్యలు తీసుకోవాలని కోరారు.జాయింట్ సర్వే ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని జాటోత్ హుస్సేన్ స్పష్టం చేశారు. సర్వే సమయంలో పిటిషనర్లు, సంబంధిత భూ హక్కుదారులు, గ్రామస్తులు, రెవెన్యూ, అటవీ, సర్వే శాఖల ప్రతినిధులు సమక్షంలో ప్రక్రియ నిర్వహించాలని, సంబంధిత వ్యక్తుల సంతకాలు, వాంగ్మూలాలు నమోదు చేయాలని సూచించారు. న్యాయస్థానాలకు నివేదికలు సమర్పించే సమయంలో సర్వే ప్రక్రియకు సంబంధించిన పూర్తి ఆధారాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.గిరిజనుల జీవనోపాధి ప్రధానంగా భూమి, అడవులపైనే ఆధారపడి ఉంటుందని, వారి హక్కులను పరిరక్షిస్తూ అటవీ సంరక్షణకు చర్యలు చేపట్టాలని జాటోత్ హుస్సేన్ అన్నారు . అటవీ శాఖ అధికారులు గిరిజనులతో స్నేహపూర్వకంగా, సమన్వయంతో పనిచేయాలని, అటవీ సంరక్షణతో పాటు గిరిజనుల జీవనోపాధి, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.అర్హులైన గిరిజనులకు అటవీ హక్కుల చట్టం, ఇతర ప్రభుత్వ నిబంధనల ప్రకారం హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. గిరిజనులకు భూ హక్కులు, ప్రభుత్వ పథకాలు, దరఖాస్తు విధానం తదితర అంశాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించడం అధికారుల బాధ్యత అన్నారు . నీరు, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలతో పాటు వ్యవసాయం, ఉద్యాన పంటలు, కాఫీ, టీ తదితర ప్రత్యామ్నాయ జీవనోపాధి అవకాశాలపై కూడా ప్రోత్సాహం అందించాలని సూచించారు.గిరిజనులపై అనవసరంగా కేసులు నమోదు చేయకుండా నిబంధనలను కచ్చితంగా పాటించాలని కమిషన్ సభ్యులు సూచించారు. అదే సమయంలో అటవీ సంరక్షణకు సంబంధించిన చట్టాలు, నిబంధనలను గిరిజనులకు అవగాహన కల్పించి, అటవీ నరికివేత వంటి చర్యలకు దూరంగా ఉండేలా చైతన్యం కల్పించాలని తెలిపారు. ప్రజలు కూడా అటవీ శాఖ అధికారులతో ఘర్షణలకు దూరంగా ఉండి, తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని సూచించారు.అటవీ శాఖ, గిరిజనుల మధ్య సోదరభావంతో కూడిన సంబంధాలతో అటవీని సంరక్షించడం ఎంత ముఖ్యమో, అటవీపై ఆధారపడి జీవించే గిరిజనుల జీవనోపాధిని పరిరక్షించడం కూడా అంతే ముఖ్యమన్నారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , కూనారం గ్రామానికి సంబంధించిన భూ సమస్యపై గతంలో నిర్వహించిన సర్వేలు, జాయింట్ సర్వే నివేదికలను పరిశీలించినట్లు తెలిపారు. జాయింట్ సర్వేకు ముందు, అనంతరం నిర్వహించిన సర్వే వివరాలతో పాటు రెవెన్యూ, అటవీ శాఖల వద్ద ఉన్న రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.తహసీల్దార్, సర్వే అధికారులు, అటవీ శాఖ అధికారులు అందుబాటులో ఉన్న రికార్డులు, మ్యాపులు, సర్వే నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితులను కూడా పరిశీలించి తుది నిర్ధారణకు రావాలని కలెక్టర్ సూచించారు. పాత సర్వేలు, తాజా జాయింట్ సర్వే, రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేసి తుది నివేదిక రూపొందిస్తామని తెలిపారు.దమ్మపేట, కరకగూడెం, అశ్వారావుపేట తదితర ప్రాంతాల్లో కూడా ఇలాంటి అటవీ–రెవెన్యూ భూ సమస్యలు ఉన్నాయని కలెక్టర్ అన్నారు . ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే జాయింట్ సర్వే ప్రక్రియ ప్రారంభమైందని, వచ్చే ఆరు నుంచి ఏడు నెలల్లో ఆయా సమస్యలపై స్పష్టత వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కూనారం సమస్య చాలా కాలంగా కొనసాగుతున్నందున దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ , కమిషన్ సభ్యులు ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని సంబంధిత ఫైళ్లు, రికార్డులను పరిశీలిస్తున్నామని తెలిపారు. జిల్లాలో సుమారు 60 శాతం వరకు అటవీ ప్రాంతం ఉందని, అటవీ సంరక్షణతో పాటు గిరిజనుల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.జిల్లాలో ఇప్పటివరకు సుమారు 2.10 లక్షల ఎకరాలకు పైగా భూమిని పోడు భూమి కింద హక్కులు కల్పించినట్లు, సుమారు 13 వేల మంది గిరిజనులకు బోర్‌వెల్స్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అనేక ప్రాంతాల్లో పోడు భూములకు రహదారి సౌకర్యాలు కూడా కల్పించినట్లు వివరించారు.కూనారం సమస్యకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, సర్వే, అటవీ శాఖలు, గ్రామ పాలనా సిబ్బందితో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసి సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ఈ కమిటీ 7 మార్చి 2026న నివేదిక సమర్పించిందని, అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా సంబంధిత భూమి అటవీ భూమిగా ఉన్నట్లు నివేదికలో తెలిపినట్లు వివరించారు. ప్రస్తుతం అంబాసత్రం భూమికి సంబంధించిన అంశం కూడా వెలుగులోకి వచ్చినందున, దీనిపై మరోసారి సమగ్రంగా పరిశీలించి రికార్డులు, చట్టపరమైన అంశాలు, జాయింట్ సర్వే ఫలితాలను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఐటీడీఏ పీవో రాహుల్ మాట్లాడుతూ , కూనారం గ్రామంలోని భూ సమస్య గత ఐదారు సంవత్సరాలుగా కొనసాగుతోందన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని పోడు భూములకు ఇప్పటికే పట్టాలు మంజూరైనప్పటికీ, నిర్దిష్ట సర్వే నంబరుకు సంబంధించిన భూమి రెవెన్యూ పరిధిలోకి వస్తుందా లేదా అటవీ శాఖ పరిధిలోకి వస్తుందా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు.ఈ ఏడాది కూడా సంబంధిత భూమిపై జాయింట్ సర్వే నిర్వహించినట్లు ఐటీడీఏ పీవో తెలిపారు. అయితే సర్వే అనంతరం కూడా కొన్ని అభ్యంతరాలు, సందేహాలు వ్యక్తమవుతున్నందున జిల్లా కలెక్టర్, డీఎఫ్‌ఓతో చర్చించి సమగ్రంగా పరిశీలిస్తామని చెప్పారు. భూమి రెవెన్యూ భూమిగా నిర్ధారణ అయితే అందుకు అనుగుణంగా, అటవీ భూమిగా నిర్ధారణ అయితే సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు చేపడతామని తెలిపారు.సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజనులకు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రెవెన్యూ, అటవీ, సర్వే, ఐటీడీఏ శాఖలు సమన్వయంతో పనిచేసి కూనారం భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తాయని తెలిపారు.ఈ పబ్లిక్ హియరింగ్‌లో కొత్తగూడెం ఆర్డీవో మధు తాసిల్దార్ శిరీష రెవెన్యూ, అటవీ, సర్వే శాఖల అధికారులు, సర్వేయర్లు, గ్రామస్థులు, గిరిజనులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ