తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణిలో నాలుగు లేబర్ కోడ్లు అమలు చేస్తే ఉద్యమిస్తాం.కార్మిక హక్కులను హరించే కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తాం: ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య.కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, సంక్షేమానికి తీవ్ర నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను సింగరేణి సంస్థలో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయొద్దని ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య డిమాండ్ చేశారు. 44 కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను బలహీనపరిచే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు.బుధవారం విడుదల చేసిన ప్రకటనలో రంగయ్య మాట్లాడుతూ.. లేబర్ కోడ్ల అమలుతో పని విధానంలో మార్పులు రావడంతో పాటు కార్మికులపై అదనపు పనిభారం, పని గంటల భారం పడే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే కఠినమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న సింగరేణి కార్మికులపై ఈ విధానాలను రుద్దడం సమంజసం కాదన్నారు. కార్మిక హక్కులను పరిరక్షించేందుకు ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.అదేవిధంగా సింగరేణిలో మెడికల్ బోర్డు విధానాన్ని కూడా పాత పద్ధతిలోనే కొనసాగించాలని రంగయ్య డిమాండ్ చేశారు. గతంలో 16 రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్మికులను మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్ చేసిన విధానాన్ని పునరుద్ధరించి, అనారోగ్యంతో పని చేయలేని స్థితిలో ఉన్న కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.అన్ఫిట్ అయ్యే కార్మికుల కుటుంబాలకు ఉపాధి, భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు.కార్మికుల హక్కులకు విఘాతం కలిగించే లేబర్ కోడ్లను సింగరేణిలో అమలు చేయాలని ప్రయత్నిస్తే ఏఐటీయూసీ చూస్తూ ఊరుకోదని రంగయ్య హెచ్చరించారు. కార్మిక సంఘాలు, కార్మికులను సమీకరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత విషయంలో యాజమాన్యం స్పష్టమైన వైఖరి అవలంబించాలని ఆయన డిమాండ్ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ