తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాంలీలా సభతో కేంద్రానికి హెచ్చరిక.ప్రజా సమస్యలపై రాజీలేని యుద్ధం ప్రకటిస్తాం.ఢిల్లీ వేదికగా ఉద్యమ దిశానిర్దేశం.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదానంలో రేపు జరగనున్న భారీ ప్రజాచైతన్య బహిరంగ సభ కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు గట్టి హెచ్చరిక కానుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం నుంచి తరలిన ప్రతినిధుల బృందంతో కలిసి సోమవారం ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పేద, మధ్యతరగతి వర్గాలు, రైతాంగం, శ్రామిక వర్గం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై గళమెత్తేందుకే ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, సామాన్య ప్రజల హక్కులను కాలరాస్తున్న పాలకుల వైఖరిని ఎండగట్టేందుకు ప్రజలు, కార్మికులు, రైతులు, యువత ఏకతాటిపైకి వస్తున్నారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి అంశాలపై రాంలీలా మైదానం వేదికగా సమరశంఖం పూరించనున్నట్లు వివరించారు. ఈ సభ ద్వారా దేశవ్యాప్త ప్రజా పోరాటాలకు స్పష్టమైన కార్యాచరణ, నూతన దిశానిర్దేశం లభించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి పెద్ద ఎత్తున హాజరవుతున్న ప్రతినిధులు ఈ పోరులో చురుగ్గా భాగస్వాములై కార్యాచరణను గ్రామ స్థాయికి తీసుకెళ్తారని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, జిల్లా నాయకులు సలిగంటిశ్రీనివాస్, చండ్ర నరేంద్ర కుమార్, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీకుమారి, వి పూర్ణ చందర్ రావు, ఉప్పుశెట్టి రాహుల్, అడుసుమిల్లి సాయిబాబా, కంచర్ల జమలయ్య, మువ్వా వెంకటేశ్వరరావు, డి. సుధాకర్, రాజబాబు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ