తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మరియు ప్రజల ప్రాణ రక్షణలో భాగంగా ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడుపుతున్న మరియు నంబర్లు సక్రమంగా లేని 44 వాహనాలను గుర్తించి, వాహనదారుల సమక్షంలోనే వాహనాలకు కొత్త నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేశారు. అలాగే వాహనాలపై ఉన్న పెండింగ్ జరిమానాలను 15,475/ రూపాయలను కట్టించారు.ఈ సందర్భంగా వాహనదారులకు పలు రోడ్డు భద్రతా సూచనలు చేశారు. ప్రతి వాహనానికి నిబంధనల ప్రకారం సరైన నంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని, నంబర్ ప్లేట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడం లేదా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేయరాదని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించరాదని తెలిపారు.అధిక వేగంతో మరియు నిర్లక్ష్యంగా వాహనాలు నడపరాదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మైనర్ బాలలకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని, రోడ్డు భద్రత మరియు ప్రజల ప్రాణ రక్షణలో భాగంగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ