తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి.రాత్రికి రాత్రే పేదల గుడిసెల కూల్చివేత దుర్మార్గం.పేదల భూపోరాటాలను అణచివేస్తే ఉద్యమం మరింత ఉధృతం.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. హన్మకొండ ఆదాలత్ సెంటర్ వద్ద శాంతియుతంగా భారీ రాస్తారోకో మరియు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వామపక్ష నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా తీవ్రంగా ఖండించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు తదితర ప్రముఖ నాయకులను, వందలాది మంది కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడం హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలో నిరుపేదలు వేసుకున్న సుమారు 360కి పైగా గుడిసెలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు రాత్రికి రాత్రే జేసీబీలతో కూల్చివేయడాన్ని నిరసిస్తూ శనివారం హన్మకొండలో వామపక్షాల ఆధ్వర్యంలో ఈ భారీ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పత్రికలకు ప్రకటన విడుదల చేస్తూ.. రాత్రికి రాత్రే పేదల గుడిసెలను కూల్చివేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్ల స్థలాల పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద శాశ్వత గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ, విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న భూమాఫియాపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పేదల భూపోరాటాలను అణచివేయాలని చూస్తే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాలను హెచ్చరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ