తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుసంధానం చేయొద్దని, లాటరల్ ఎంట్రీ విధానాన్ని రద్దు చేయొద్దని ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యాల వినయ్ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన విద్యా విధానం పేరుతో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటం సరికాదన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పేరుతో ప్రభుత్వ సాంకేతిక విద్యను ప్రైవేటీకరించే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని కోరారు. పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను కార్పొరేట్ శక్తులకు అప్పగించే చర్యలు విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తాయని అన్నారు.పాలిటెక్నిక్ విద్య ద్వారా ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారని, ఈ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్ల విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. లాటరల్ ఎంట్రీ విధానాన్ని కొనసాగించాలని, పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కొరిమి సంజయ్, పాలిటెక్నిక్ కమిటీ సభ్యులు సలిగంటి జయదీప్, రామ్ చరణ్, సాయిరామ్, వడ్డెబోయిన యశ్వంత్, సన్నీ, స్నేహిత్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ