తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చుంచుపల్లి మండలం పెనగడప ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలు, కొనుగోలు ప్రక్రియ, లోడింగ్, రవాణా ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రంలో సుమారు 1200 క్వింటాళ్ల ధాన్యం నిల్వలు ఉన్నాయని, వాటిని సుజాతనగర్‌లోని రైస్ మిల్‌కు రెండు రోజులలోపు తరలింపు పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లు, కవర్లు ఏర్పాటు చేసి పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షపు నీరు ధాన్యం నిల్వల వద్ద చేరకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలిస్తూ లోడింగ్, రవాణా పనులను సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. రైతులకు కేంద్రాల్లో తాగునీరు, నీడ, సదుపాయాలు వంటి అవసరమైన వసతులు కల్పించాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అన్నారు .అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంటడి సి ఓ ప్రేమ్ కుమార్, డి ఎం సతీష్, చుంచుపల్లి తాసిల్దార్ నాగరాజు, ఎంపీడీవో సుభాషిని, ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ