తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మే 14 తెలుగు వెలుగు)జూలూరుపాడు మండల పరిధిలోని గుండెపుడి రెవెన్యూ ప్రాంతం, సర్వే నంబర్ 117లో సీలింగ్ భూమి ఆక్రమణలకు గురవుతోందని, తక్షణమే విచారణ నిర్వహించి అక్రమాలను అడ్డుకోవాలని గ్రామీణ పేదల సంఘం, ఆదివాసీ సంఘం నేత బచ్చల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గిరిజన, గిరిజనేతర పేదలు జీవనం కోసం ప్రభుత్వ భూముల్లోకి వెళితే రెవెన్యూ, అటవీశాఖ అధికారులు అడ్డుకొని, పలు విధాలుగా వారిని ఇబ్బందులకు గురిచేస్తుంటారని అన్నారు. కానీ కొందరు బడాబాబులకు మాత్రం ఆయా శాఖలకు చెందిన అధికారులు కొందరు వత్తాసు పలుకుతూ గుండెపుడి రెవెన్యూ సర్వే నెంబర్ 117లో కొంత సీలింగ్ భూమిని ఏజెన్సీ, గిరిజన ప్రాంత చట్టాలను ఉల్లంఘిస్తూ పథకం ప్రకారం ఒకరిద్దరి వ్యక్తుల పేరున అక్రమంగా పట్టాలు చేశారని ఆరోపించారు. ఇంతటితో ఆగకుండా అక్రమంగా సీలింగ్ భూములు కాజేసి, అట్టి భూముల్లో పెద్ద ఎత్తున పైరవీలు చేసి, పరపతి ఉపయోగించి బినామీల పేరుతో అక్రమ మార్గాన మైనింగ్ అనుమతులు తీసుకొచ్చారని అన్నారు. అనుమతుల పేరుతో గత రెండు నెలల కాలంగా కాజేసిన సీలింగ్ భూమిలో పెద్ద ఎత్తున యంత్రాలతో గుట్టలను తవ్వుతున్నారని అన్నారు. టిప్పర్లతో రాత్రింబవళ్లు మట్టిని దూర ప్రాంతాలకు తరలిస్తూ లక్షల రూపాయలు అక్రమ ధనార్జనకు పాల్పడుతున్నారని అన్నారు. కొంతమంది ముఠాగా తయారై ధనార్జనే ధ్యేయంగా మట్టి మాఫియా దందా చేస్తున్నారని, ప్రభుత్వ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపితే సీలింగ్ భూమిని పట్టా చేసిన విషయం తేట తెల్లమవుతోందని అన్నారు. సీలింగ్ భూమి ఆక్రమణ, నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు చేయటం, గుట్టలను తవ్వి ప్రకృతిని విధ్వంసం చేయడం వంటి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపి సీలింగ్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనింగ్ ఆఫీసర్, కొత్తగూడెం రెవిన్యూ డివిజన్ ఆఫీసర్ గారికి కూడా లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఏజెన్సీ ప్రాంతంలో చట్టాలకు విరుద్ధంగా సీలింగ్ భూములను ఆక్రమించి, మైనింగ్ మాఫియాకు పాల్పడుతున్న వ్యక్తులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ