తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలికలను గర్భాశయ కంఠ క్యాన్సర్ నుండి రక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన HPV (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా కార్యక్రమాన్ని ఈ రోజు జిల్లాలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో అమలు చేయబడుతోంది. మొదటగా *కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH)*లో నిర్వహించిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ అంకిత్, IAS, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం మేయర్ గణేష్, డా. రాధామోహన్ (సూపరింటెండెంట్, GGH కొత్తగూడెం) ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ బాలికల ఆరోగ్య రక్షణలో HPV టీకా కార్యక్రమం ఎంతో కీలకమని తెలిపారు. అర్హత కలిగిన బాలికలు ఈ టీకాను తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో గర్భాశయ కంఠ క్యాన్సర్ నుండి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. తరువాత పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. తుకారాం రాథోడ్ (DMHO) మరియు డా. రవిబాబు (DCHS) కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ HPV టీకా బాలికల ఆరోగ్య రక్షణలో ముఖ్యమైనదని, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఈ టీకాను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. ప్రసాద్ (డిప్యూటీ DMHO), డా. ప్రతాప్ (PO-CHI), డా. స్పందన (PO-NVBDCP), డా. రాంప్రసాద్ (సూపరింటెండెంట్, CHC పాల్వంచ) పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా ఒక బాలికకు ప్రతీకాత్మకంగా HPV టీకా ఇవ్వడం ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో GGH కొత్తగూడెం మరియు CHC పాల్వంచ వైద్య సిబ్బంది, సంబంధిత PHCలకు చెందిన మెడికల్ ఆఫీసర్లు, నర్సింగ్ సిబ్బంది, ANMలు, ఆశా కార్యకర్తలు మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.అధికారులు తెలిపిన ప్రకారం మొదటి ఒక నెలపాటు ఈ కార్యక్రమం జిల్లా లోని GGH, ఏరియా హాస్పిటల్స్ (AH) మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ (CHC) లో నిర్వహించబడుతుంది. అనంతరం తదుపరి రెండు నెలల పాటు జిల్లాలోని 24 గంటల సేవలు అందించే PHCలలో (24 Hrs PHCs) ఈ టీకా కార్యక్రమం కొనసాగించబడుతుంది. అర్హులైన బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ