తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రూ.10,814 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలి పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉండాలి : ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ విద్యారంగాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ విమర్శించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చుంచుపల్లి మండల కేంద్రంలోని మొహమ్మద్ రజబ్ అలీ భవన్‌లో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్.కె. షాహిద్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో గత ఏడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.10,814 కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. బకాయిలు విడుదల కాకపోవడంతో పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఏఎన్‌ఎంలు, వర్కర్లను పూర్తిస్థాయిలో నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, 27 పాఠశాలలను మూసివేయడం, వేలాది పాఠశాలలను కుదించే చర్యలను ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను స్కిల్ యూనివర్సిటీలకు అనుసంధానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు చేపడుతున్న శాంతియుత ఆందోళనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం శుభపరిణామమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. విద్యారంగ సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించకపోతే విద్యార్థులను ఏకం చేసి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యాల వినయ్, జిల్లా ఉపాధ్యక్షులు కొరిమి సంజయ్, మర్మం ఉమామహేశ్వర్, నాయకులు హాసిని, శ్యామల, స్వరాంజలి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ