తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అశ్వాపురం మండలంలో మంగళవారం జిల్లా కలెక్టర్ అంకిత్ పలు కార్యక్రమాలను ఆకస్మికంగా పరిశీలించారు. మల్లెలమడుగు గ్రామంలో నిర్వహిస్తున్న సెన్సస్–2027 జనగణన ఇంటింటి సర్వే ప్రక్రియను పరిశీలించిన అనంతరం మొండికుంట ధాన్యం కొనుగోలు కేంద్రం, సీతారాంపురంలోని శివసాయి రైస్ మిల్‌ను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రాచలం సబ్ కలెక్టర్ మృణల్ శ్రేష్ఠ కూడా కలెక్టర్ వెంట పాల్గొన్నారు. మల్లెలమడుగు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లతో కలెక్టర్ మాట్లాడి, వివరాల నమోదు విధానం, డేటా సేకరణ ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనంతరం దేశంలో జరుగుతున్న 16వ జనగణన ఇదేనని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి జనగణన కావడం విశేషమన్నారు. ఈసారి తొలిసారిగా పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలో సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. జనగణనలో మొత్తం 34 ప్రశ్నలు ఉంటాయని, ఒక్కో కుటుంబానికి సంబంధించిన వివరాలను సుమారు ఐదు నిమిషాల్లోనే నమోదు చేయవచ్చని కలెక్టర్ వివరించారు. ఎన్యూమరేటర్ల ఐడీ కార్డులపై ఉన్న క్యూ ఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేస్తే వారి పూర్తి వివరాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజలు అధికారిక సిబ్బందికి సహకరించి ఖచ్చితమైన సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచార సేకరణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, ప్రతి ఇంటిని కవర్ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మొండికుంట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలోని ధాన్యం నిల్వలు, కొనుగోలు ప్రక్రియ, రవాణా ఏర్పాట్లు, రైతులకు అందుతున్న సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిన్నటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, ప్రస్తుతం ఉన్న నిల్వలు, రైతుల నుంచి ధాన్యం రాక పరిస్థితి, ఎదురవుతున్న సమస్యలపై సమగ్రంగా సమీక్షించారు. ప్రస్తుతం కేంద్రంలో 5,550 ధాన్యం బ్యాగులు నిల్వలో ఉన్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. కొనుగోలు కేంద్రానికి మ్యాపింగ్ చేసిన రైస్ మిల్లుల వివరాలు, ధాన్యం తరలింపు ప్రక్రియ, లోడింగ్–అన్‌లోడింగ్ పరిస్థితులు, లారీల లభ్యత తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. రైతులు ధాన్యం తీసుకొచ్చిన వెంటనే తూకం, రికార్డు నమోదు, నిల్వ, రవాణా వంటి ప్రక్రియలు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా ధాన్యం పేరుకుపోకుండా మిల్లులకు సకాలంలో తరలించేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ధాన్యం నాణ్యతను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ తేమ శాతం, శుభ్రత, నిల్వ విధానం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. రైతులు తీసుకొచ్చే ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాల మేరకు పారదర్శకంగా కొనుగోలు చేయాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీలతో కలెక్టర్ మాట్లాడారు. బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన హమాలీల పని పరిస్థితులు, వసతి, తాగునీరు, ఆహారం తదితర సౌకర్యాలపై ఆరా తీశారు. వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆవిష్కరించారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల నిర్వహణ, దిగుబడి పెంపు, సాంకేతిక సూచనలు గ్రామస్థాయిలో అందించేలా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ ఆధునిక సాగు విధానాలను అవలంబించాలని కలెక్టర్ అన్నారు. అనంతరం అశ్వాపురం మండలంలోని సీతారాంపురం గ్రామంలో ఉన్న శివసాయి రైస్ మిల్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లులో ధాన్యం నిల్వలు, మిల్లింగ్ సామర్థ్యం, స్టాక్ వివరాలు, మిల్లింగ్ ప్రక్రియపై మిల్ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రైస్ మిల్లులో సుమారు 6,000 క్వింటాళ్ల ధాన్యం నిల్వలో ఉన్నట్లు మిల్ సిబ్బంది వివరించింది. మిల్లులో ధాన్యం నిల్వ విధానం, భద్రతా చర్యలు, రికార్డు నిర్వహణ, తరలింపు ప్రక్రియలను పరిశీలించిన కలెక్టర్ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మిల్లింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రైతులు అమ్మిన ధాన్యం వేగంగా మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, నిల్వలు పేరుకుపోకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. రైతులు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా కొనుగోలు చేసి, సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా మరియు వేగవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో సర్పంచ్ మర్రి సంధ్యారెడ్డి, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు, తాసిల్దార్ సూర్యప్రకాష్, వ్యవసాయ శాఖ ఏడి తాతారావు, ఏఎస్ఓ రాజ్యలక్ష్మి, ఆర్‌ఐ లీలావతి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ