తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న వేధింపులను అరికట్టేందుకు షీ టీమ్స్ ప్రత్యేకంగా పనిచేస్తున్నాయని షీ టీమ్ ఎస్‌ఐ రమాదేవి తెలిపారు. గురువారం ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. రాగింగ్, టీజింగ్, బ్లాక్‌మెయిలింగ్, తప్పుడు కాల్స్, అసభ్యకర మెసేజ్‌లు, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించడం, తాకడం, తోయడం వంటి వేధింపులకు గురైతే మహిళలు, బాలికలు భయపడకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలు, రద్దీ ప్రాంతాలు, బస్సులు తదితర ప్రాంతాల్లో మహిళలకు భద్రత కల్పించడంతో పాటు వేధింపులకు పాల్పడే వారిపై షీ టీమ్స్ చర్యలు తీసుకుంటాయని తెలిపారు. సమస్య ఎదురైనప్పుడు షీ టీమ్ నంబర్‌కు ఫోన్ చేయడంతో పాటు వాట్సాప్ ద్వారా మెసేజ్, వాయిస్ రికార్డింగ్ లేదా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు భయపడేవారు లేదా ఇబ్బంది పడేవారి వద్దకే షీ టీమ్స్ చేరుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాయని తెలిపారు. ఫిర్యాదుదారుల వ్యక్తిగత వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. మైనర్లు తప్పు చేసిన సందర్భాల్లో వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, నేరం తీవ్రతను బట్టి కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహిళలు, బాలలు, ఇతర బలహీన వర్గాల రక్షణ కోసం అమలులో ఉన్న పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, ఎస్సీ/ఎస్టీ చట్టం, సీనియర్ సిటిజెన్స్ రక్షణ చట్టం తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళలు విద్యతో పాటు ఆర్థికంగా స్వావలంబన సాధించి, ఆత్మవిశ్వాసంతో జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ