తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : క్షమాభిక్ష కోరినవారు దేశభక్తి గురించి మాట్లాడటం హాస్యాస్పదం అధికారికంగా విలీన దినం జరపాలి..పాఠ్యాంశాల్లో చేర్చాలి 24 లక్షల ఎకరాల భూపంపిణీ చేసిన ఘనత కమ్యూనిస్టులదే మతోన్మాద శక్తుల విభజన కుట్రలను తిప్పికొడదాం పోరాటాలతోనే ప్రజాస్వామ్య, హక్కుల పరిరక్షణ అమరవీరుల ఆశయ సాధనకు పునరంకితం కావాలి : సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను మత రంగు పులిమి వక్రీకరించే మతోన్మాద శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని, తెలంగాణ అమరుల నిజమైన త్యాగాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా పిలుపునిచ్చారు. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని 'శేషగిరి భవన్' జిల్లా కార్యాలయంలో గురువారం తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ, తెలంగాణ విలీన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో సాబీర్ పాషా మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను ప్రభుత్వాలు అధికారికంగా తెలంగాణ విలీన దినోత్సవంగా ప్రకటించాలని, భావితరాలకు తెలిసేలా చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. నిజాం నిరంకుశ పాలనపై, భూస్వాముల వెట్టిచాకిరీ, దోపిడీకి వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీయే ముందుండి నాయకత్వం వహించిందని స్పష్టం చేశారు. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగీ, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్ వంటి వీరుల నాయకత్వంలో 4,500 మంది ప్రాణాలర్పించి తెలంగాణను విముక్తి చేశారని గుర్తుచేశారు. ఈ మహత్తర పోరాటం ద్వారా 10 లక్షల ఎకరాలు, తదనంతర ఉద్యమాలతో కలిపి మొత్తం 24 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర ఒక్క ఎర్రజెండాకే దక్కుతుందని కొనియాడారు. స్వాతంత్య్ర, సాయుధ పోరాటాల్లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ శక్తుల పాత్ర ఏమాత్రం లేదని, నాడు క్షమాభిక్షలు కోరిన వారు నేడు దేశభక్తి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు కమ్యూనిస్టులు ఎల్లప్పుడూ పునరంకితమై పోరాడతారని ఆయన పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న అమరవీరుల కుటుంబాలను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. పట్టణానికి చెందిన దూడల బుచ్చయ్య అమరవీరుడు దొడ్డి కొమరయ్య వేషధారణతో హాజరై కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కంచర్ల జమలయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, గనిగళ్ల వీరాస్వామి, కందుల భాస్కర్, వాసిరెడ్డి మురళి, మువ్వ వెంకటేశ్వరరావు, భూక్యా దస్రు, ఎస్.కె. ఫహీమ్, జిల్లా సమితి సభ్యులు దీటి లక్ష్మీపతి, కొమారి హన్మంతరావు, భూక్య శ్రీనివాస్, నేరెళ్ల రమేష్, జక్కుల రాములు, దారా శ్రీనివాస్, పేరాల శ్రీనివాస్, రమణమూర్తి, సప్క నాగేశ్వరరావు, యూసుఫ్, ధర్మరాజు, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, గోపికృష్ణ, షాహీన్, పైడిపల్లి లక్ష్మి, కైసర్, కార్పొరేటర్లు బోయిన విజయ్ కుమార్, దుర్గయ్య, పొలమూరి ధనలక్ష్మి, కూరపాటి సుధాకర్, బండి నర్సింహా, దాసరి శ్రీనివాస్, సత్యనారాయణాచారి, సపావట్ రవి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ