తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. లక్ష్మీదేవిపల్లిలోని కేంద్రాన్ని చుంచుపల్లికి మార్చే అంశంపై క్షేత్రస్థాయి పరిశీలన.చుంచుపల్లిలో విజయ డెయిరీ కోసం ఇప్పటికే స్థలం కేటాయించినందున, ఆ స్థలంలో విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చర్యలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు లక్ష్మీదేవిపల్లిలోని ప్రస్తుత విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రం ఉన్న స్థలాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉన్నందున, కేంద్రాన్ని చుంచుపల్లికి మార్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఇందులో భాగంగా లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని గురువారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేంద్రాన్ని చుంచుపల్లికి మార్చే అంశంపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా కేంద్రంలో ప్రతిరోజూ జరుగుతున్న పాల సేకరణ, శీతలీకరణ ప్రక్రియ, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, పరికరాల పనితీరు తదితర వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం పరిధిలో సుమారు 30 గ్రామాలకు చెందిన 400 మంది రైతులు పాల సేకరణకు అనుసంధానమై ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రోజుకు సుమారు 500 లీటర్ల వరకు పాలు సేకరిస్తుండగా, పాల ఉత్పత్తి అధికంగా ఉండే సీజన్‌లో రోజువారీ సేకరణ సుమారు 4,000 లీటర్ల వరకు పెరుగుతుందని వివరించారు. ఉదయం, సాయంత్రం నిర్ణీత సమయాల్లో పాలను సేకరించి ఖమ్మం డెయిరీకి తరలిస్తున్నట్లు తెలిపారు.అనంతరం కలెక్టర్ కేంద్రంలోని కూలింగ్ ట్యాంక్, స్టోరేజ్ వ్యవస్థ, కంప్రెసర్ తదితర పరికరాలను పరిశీలించారు. ప్రస్తుత భవనం, పరికరాల పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అంశంపై అధికారులతో చర్చించారు.చుంచుపల్లిలో విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే స్థలాన్ని గుర్తించి, విజయ డెయిరీ అధికారులకు సూచించినందున, కేంద్రం ఏర్పాటుకు అవసరమైన తదుపరి చర్యలను త్వరితగతిన చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. రైతులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా కేంద్రాన్ని ఏర్పాటు చేసి, పాల సేకరణ మరియు శీతలీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.కేంద్రాన్ని మార్చే సమయంలో పాల సేకరణకు ఎలాంటి అంతరాయం కలగకుండా, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. నూతన కేంద్రం అందుబాటులోకి వచ్చిన తర్వాత రైతులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుతో ఈ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, అదే సమయంలో విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు కూడా ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు.కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే పనులను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.ఈ పరిశీలనలో లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్ శిరీష, విజయ డెయిరీ మేనేజర్ సౌజన్య, సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ