తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణి వినతులకు సత్వర పరిష్కారం చూపాలి : అదనపు కలెక్టర్ వేణుగోపాల్. ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి.సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఆర్‌ఓ పద్మావతితో కలిసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు భూ సమస్యలు, గృహాలు, ఉపాధి, విద్యుత్, మౌలిక వసతులు తదితర అంశాలపై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజావాణి కీలక వేదికగా నిలుస్తోందన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.వినతుల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యానికి తావివ్వకూడదని స్పష్టం చేశారు. తక్షణమే పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఇతర సమస్యలను సంబంధిత శాఖలకు పంపించి వాటి పరిష్కార స్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి ప్రజలకు సత్వర సేవలు అందించాలని తెలిపారు.జిల్లా కేంద్రంతో పాటు మండల స్థాయిలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో కూడా ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన ఆధార పత్రాలతో వినతులు సమర్పిస్తే పరిష్కారం మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుందని అన్నారు .ప్రజావాణిలో వచ్చిన కొన్ని వినతులు 1. ఇల్లందు మండలానికి చెందిన రచ్చ సుజాత 2008లో ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్ సమక్షంలో జనజీవన స్రవంతిలోకి వచ్చి లొంగిపోయినట్లు తెలిపారు. సీపీఐ (ఎంఎల్) పీపీజీ గ్రూప్‌కు చెందిన లింగన్న దళంలో ఆరు సంవత్సరాల పాటు దళ సభ్యురాలిగా పనిచేసిన అనంతరం లొంగిపోయిన సమయంలో ప్రభుత్వం ఐదు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చినట్లు, ప్రస్తుతం భర్త మృతి చెందడంతో ముగ్గురు పిల్లలతో ఒంటరి మహిళగా జీవిస్తున్నానని, ఇప్పటివరకు భూమి కేటాయించలేదని, తనకు హామీ ఇచ్చిన ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని మంజూరు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం ఓఎస్-ఈకి ఎండార్స్ చేశారు.అశ్వారావుపేట మండలం దిబ్బగూడెం గ్రామానికి చెందిన తాటి పద్మ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. గతంలో సమర్పించిన దరఖాస్తును పరిశీలించి అర్హత మేరకు ఇల్లు మంజూరు చేయాలని కోరగా పరిశీలించి తగు చర్యలు నిమిత్తం పీడీ హౌసింగ్‌కు ఎండార్స్ చేశారు.కొత్తగూడెం కార్పొరేషన్ 53వ డివిజన్‌కు చెందిన ముద్దంగుల మహేష్ రహదారి మధ్యలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించి సురక్షిత ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం ఎన్‌పీడీసీఎల్‌కు ఎండార్స్ చేశారు.సుజాతనగర్ మండలం సర్వారం తండాకు చెందిన బాణోత్ హిమబిందు తన కుటుంబం గతంలో అంగన్‌వాడీ పాఠశాల నిర్మాణం కోసం ప్రభుత్వానికి భూమి ఇచ్చిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, తాను డిప్లొమా, బీటెక్ (EEE) పూర్తి చేసినందున అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం లేదా అంగన్‌వాడీ పోస్టు కల్పించాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు డీడబ్ల్యూఓకు ఎండార్స్ చేశారు.అశ్వారావుపేట మండలం రామన్నగూడెం సర్పంచ్ మడకం నాగేశ్వరరావు ఎల్-3 జాబితాలో ఉన్న అర్హులైన 71 మంది లబ్ధిదారులను ఎల్-1 జాబితాలోకి మార్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును తగు చర్యల నిమిత్తం పీడీ హౌసింగ్‌కు ఎండార్స్ చేశారు.ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ