తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ధాన్యం శుభ్రపరిచి తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి.జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైనదని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఆరు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సుమారు 15 లారీల ధాన్యం రావడం జరిగిందన్నారు.ఈ క్రమంలో ఈ రోజు ఎర్రగుంట వద్ద జాతీయ రహదారిపై రైతులు ధర్నా నిర్వహించిన ఘటనపై ఆయన స్పందించారు. పౌరసరఫరాల శాఖ అధికారుల పరిశీలనలో ధాన్యంలో తేమ శాతం (మాయిశ్చర్) అనుకూలంగా ఉన్నప్పటికీ, ధాన్యం పరిశుభ్రత లోపించడం గమనించినట్లు తెలిపారు. గుంపెనలు మరియు మలినాలు కలిసివుండటం వల్ల నాణ్యత ప్రమాణాలకు సరిపోకపోవడంతో కొనుగోలులో ఇబ్బందులు తలెత్తినట్లు వివరించారు.వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నించగా కూడా ధాన్యం శుభ్రపరిచే ప్రక్రియ సరిగా జరగలేదని వెల్లడించినట్లు చెప్పారు. వెంటనే ప్యాడీ క్లీనర్లను వినియోగించి ధాన్యాన్ని శుభ్రపరిచిన తరువాత కొంతవరకు మెరుగైన ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ, కొంతమంది రైతులు శుభ్రపరచకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ధర్నాకు దారితీసిందన్నారు.ఈ విషయంపై తక్షణమే పౌరసరఫరాల శాఖ అధికారులు, సంబంధిత మేనేజర్లు రైతులతో చర్చించి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. రేపటి నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని పరిశుభ్రపరిచి మాత్రమే కొనుగోలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు, కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లకు ఇప్పటికే మార్గదర్శకాలు అందించినట్లు వెల్లడించారు.రైతులు ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ తమ ధాన్యాన్ని పూర్తిగా శుభ్రపరిచి తీసుకురావాలని, కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు రైతులు సహకరించాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ