తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజలపై నిత్యావసర భారాలు మోపుతున్న కేంద్రం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి నిత్యావసరాల ధరల నివారణకు చర్యలు చేపట్టాలి ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలి కార్పొరేట్ శక్తుల దోపిడీని అరికట్టాలి ప్రజల ప్రాథమిక అవసరాలను హక్కుగా గుర్తించాలి దేశంలో ఇంధన కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేస్తాం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశప్రజలకోసం కాకుండా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుండంవల్లే సామాన్య ప్రజలపై నిత్యావసర భారాలు విపరీతంగా పెరుగుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా బుధవారం సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాళీ సిలిండర్లు, ప్లకార్డులతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భగా కూనంనేని మాట్లాడుతూ ఆకాశాన్నంటుతున్న గ్యాస్ ధరలతో సామాన్యుడి వంటిల్లు మండుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. నిత్యావసరాల ధరల నివారణకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టకుండా, కార్పొరేట్ శక్తుల దోపిడీకి ఎర్రటి తివాచీ పరుస్తున్నారని మండిపడ్డారు. ప్రజాపంపిణీ వ్యవస్థను అటకెక్కించి పేదల నోటికాడ కూడును లాగేస్తున్నారని, వెంటనే పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అయన డిమాండ్ చేశారు. ప్రజల ప్రాథమిక అవసరాలను హక్కుగా గుర్తించి నెరవేర్చాల్సింది పోయి, వాటిని వ్యాపార వస్తువులుగా మార్చడం సిగ్గుచేటన్నారు. దేశంలో ఇంధన కొరతపై ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళికే లేదని, ఇప్పటికైనా నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సామాన్యుడి గొంతుకై నిలబడతామని, ఈ పోరాటాలను గ్రామ గ్రామానికి ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, నాయకులు కంచర్ల జమలయ్య, సలిగంటి శ్రీనివాస్, వాసిరెడ్డి మురళి, వంగ వెంకట్, ఎస్ కె ఫహీమ్, దీటి లక్ష్మీపతి, కె రత్నకుమారి, మునిగడప పద్మ, కార్పొరేటర్లు, కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల సిపిఐ నాయకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ