తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో ఆపదమిత్రల పాత్ర కీలకం యువ ఆపదమిత్రల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్ సమయస్ఫూర్తి, మానసిక అప్రమత్తతతో విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి విపత్తులు సంభవించిన సమయంలో తక్షణమే స్పందించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో ఆపదమిత్రలు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. లక్ష్మీదేవి పల్లి మండలం చాతకొండ ఆరవ బెటాలియన్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఆధ్వర్యంలో యువ ఆపదమిత్రల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా 6వ బెటాలియన్‌కు చేరుకున్న కలెక్టర్‌కు బెటాలియన్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ భౌగోళిక, వాతావరణ పరిస్థితుల వైవిధ్యం కారణంగా దేశంలో వివిధ రకాల విపత్తులు సంభవించే అవకాశం ఉందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరదలు, ఆకస్మిక వరదలు, పట్టణ ప్రాంతాల్లో నీటి ముంపు, అటవీ అగ్నిప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాలు తదితర విపత్తులు సంభవించే అవకాశం ఉన్నందున స్థానికంగా శిక్షణ పొందిన యువత అందుబాటులో ఉండటం ఎంతో అవసరమన్నారు. అధికారిక సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకునేలోపు స్థానికంగా శిక్షణ పొందిన ఆపదమిత్రలు తక్షణ సహాయక చర్యలు చేపట్టడం ద్వారా ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చన్నారు. 6వ బెటాలియన్ కమాండెంట్ పి.సి.వి. రమణ మాట్లాడుతూ విపత్తులు సంభవించిన తొలి కొన్ని నిమిషాలు అత్యంత కీలకమన్నారు. అధికారిక సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకునేలోపు స్థానికంగా శిక్షణ పొందిన ఆపదమిత్రలు వేగంగా స్పందించి ప్రాథమిక సహాయక చర్యలు చేపట్టగలరన్నారు. శిక్షణలో బోట్ నిర్వహణ, తాళ్ల సహాయంతో రక్షణ చర్యలు, పైకి ఎక్కడం, కిందికి దిగడం, రాక్ క్లైంబింగ్, వివిధ రకాల ముడుల వినియోగం వంటి ప్రాక్టికల్ అంశాలను పూర్తిగా నేర్చుకోవాలని సూచించారు. శిక్షణలో ఏదైనా అంశం స్పష్టంగా అర్థం కాకపోతే శిక్షకులను అడిగి తెలుసుకుని, పదేపదే సాధన చేయడం ద్వారా పూర్తి నైపుణ్యం, ఆత్మవిశ్వాసం సాధించాలని తెలిపారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా ఆపదమిత్రలకు జిల్లా కలెక్టర్ అంకిత్ చేతుల మీదుగా శిక్షణ కిట్లను అందజేశారు. విపత్తుల సమయంలో సహాయక చర్యల్లో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకు వచ్చిన ఆపదమిత్రలకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శిక్షణ పొందుతున్న ప్రతి ఆపదమిత్రకు మూడు సంవత్సరాల కాలానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 416 మంది ఆపదమిత్రులకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా తొలి విడతగా 120 మందికి శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ శ్రీధర్ రాజా, అసిస్టెంట్ కమాండెంట్ మరియా దాస్, లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్ శిరీష, ఎంపీడీవో సుచిత్ర, పోలీసు, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు, శిక్షకులు, ఆపదమిత్రలు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ