తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఉర్దూగర్ లో ముస్లిం ఐక్య సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్షులు షేక్ ముజాహిద్, షేక్ హుస్సేన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి షేక్ మొహమ్మద్ గౌస్ మాట్లాడుతూ..ముస్లిం సమాజాన్ని సామాజికంగా,ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చేయడంతో పాటు సమాజంలో ఐక్యత,సత్ప్రవర్తన,సేవా భావం,సమన్యాయం పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం పనిచేస్తోందని సంఘం తెలిపారు.తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లాలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఖురాన్,ప్రవక్త బోధనల్లో చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ఐదు ప్రధాన అంశాల ఆధారంగా సంఘం పనిచేస్తోందన్నారు.విశ్వాసం, ఐక్యత,సత్ప్రవర్తన,సేవ, సమన్యాయం ప్రధాన లక్ష్యాలని వివరించారు.భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ లౌకిక విలువలు,మత సామరస్యం, మత సహనాన్ని పాటించాలని, హిందూ-ముస్లిం భాయీ భాయీ భావనతో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు. యువతలో సత్ప్రవర్తన పెంపొందించేందుకు చిన్న వయసు నుంచే మక్తబ్‌ల ద్వారా మంచి విలువలను నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు.ముస్లింలకే పరిమితం కాకుండా అవసరంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు విద్య,వైద్యం, సంక్షేమం,ఆర్థిక సహాయం వంటి సేవలు అందించేందుకు సంఘం ముందుంటుందని తెలిపారు.రాజకీయాలకు అతీతంగా ముస్లిం సమాజ అభివృద్ధి కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు.సమాజంలో ప్రతి ఒక్కరికీ సమన్యాయం అందాలని,డబ్బున్నవారికి ఒక న్యాయం,పేదలకు మరో న్యాయం ఉండకూడదన్నారు. కులమత భేదాలు లేకుండా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశ సమగ్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.సెప్టెంబర్ 12న సాయంత్రం 6:30 గంటలకు కొత్తగూడెం క్లబ్‌లో భారీ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.జిల్లాలోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని ముస్లిం ఐక్య సంఘం నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో అభిద్ హుస్సేన్,జియావుద్దీన్, హుసేన్ అలీ,హాఫిజ్ జమీల్, అన్వార్,మంజార్,రసూల్, అహ్మద్,తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ