తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దశాబ్దాలు గడుస్తున్నా పేదల దరిచేరని స్వాతంత్య్ర ఫలాలు కేంద్రం విధానాలతో పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగం, అసమానతలు సంపద కొద్దిమందికే పరిమితం కావడం దుర్మార్గం అమరుల ఆశయ సాధనకు పోరాడాలి : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎందరో మహనీయుల త్యాగాలతో సిద్ధించిన దేశం నేడు కార్పొరేట్ శక్తుల చేతుల్లో బందీ అవుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం కొత్తగూడెం పట్టణంతో పాటు చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల పరిధిలోని 102 కేంద్రాల్లో జెండావిష్కరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, సిపిఐ కార్యాలయం, గ్రామ పంచాయతీ భవనాలు, కార్మిక అడ్డాలు, బస్తీ కూడళ్లలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, స్వాతంత్య్ర పోరాట అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఆ ఫలాలు నేటికీ అట్టడుగు పేద వర్గాలకు అందకపోవడం అత్యంత బాధాకరమన్నారు. కేంద్ర పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, విభజన విధానాల వల్ల దేశంలో పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయని ధ్వజమెత్తారు. దేశ సంపద అంతా కొద్దిమంది బడా కార్పొరేట్ల చేతుల్లో పోగుపడుతుంటే, శ్రమజీవులు, సామాన్య ప్రజలు మాత్రం నిత్యం బతుకుపోరాటం చేయాల్సి వస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను, ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. స్వాతంత్య్ర పోరాట యోధుల ఆశయాలైన సమసమాజ స్థాపన కోసం, పేదల హక్కుల సాధన కోసం ప్రజలంతా ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్, కందుల భాస్కర్, కంచర్ల జమలయ్య, జిల్లా సమితి సభ్యులు భూక్యా శ్రీనివాస్, మునిగడప వెంకటేశ్వర్లు, గెడ్డాడు నగేష్, కె రత్నకుమారి, యాండ్ర మహేష్, నాయకులు ఎండి యూసుఫ్, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, నేరెళ్ల శ్రీనివాస్, కార్పొరేటర్లు మునిగడప పద్మ, బండి నర్సింహా, పి ధనలక్ష్మి, పడాల ఆకాంక్ష, నామా కీర్తి, మంద నాగలక్ష్మి, పట్టణ నాయకులు కె ధర్మరాజు, జలీల్, షహీన్, కైసర్, నాగరాజు, అస్మత్, భవాని తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ