తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అర్హులందరికీ దశలవారీగా ఇళ్ల కేటాయింపునకు కృషి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.రాజకీయ, వ్యక్తిగత సిఫార్సులకు తావులేదు.కొత్తగూడెం లో లక్కీ డ్రా ద్వారా 214 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు. లబ్ధిదారుల ఎంపికలో వంద శాతం పారదర్శకత: జిల్లా కలెక్టర్ అంకిత్అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి దశలవారీగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.కొత్తగూడెం మండలంలో మిగిలి ఉన్న 214 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం గురువారం కొత్తగూడెం క్లబ్లో లక్కీ డ్రా నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా కేటగిరీల వారీగా, అనంతరం వార్డు వారీగా లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, దరఖాస్తుదారులు, లబ్ధిదారుల సమక్షంలో ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు.కొత్తగూడెం మండలంలో మొత్తం 756 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉండగా, ఇప్పటికే 542 ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. మిగిలిన 214 ఇళ్లను ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 10లోని మార్గదర్శకాలకు అనుగుణంగా కేటాయిస్తున్నారు. మొత్తం 214 ఇళ్లలో ఎస్సీలకు 17 శాతం మేర 36 ఇళ్లు, ఎస్టీలకు 6 శాతం మేర 13 ఇళ్లు, బీసీ–ఓసీ కేటగిరీలకు 65 శాతం మేర 139 ఇళ్లు, మైనారిటీలకు 12 శాతం మేర 26 ఇళ్లు కేటాయించారు. ఇందులో 203 ఇళ్లు సాధారణ కేటగిరీకి, 11 ఇళ్లు దివ్యాంగుల కేటగిరీకి కేటాయించారు.ప్రస్తుత దశలో మొత్తం 2,547 మంది అర్హులుగా గుర్తించబడ్డారు. వీరిలో ఎస్సీ కేటగిరీలో 741 మంది, ఎస్టీ కేటగిరీలో 161 మంది, బీసీ–ఓసీ కేటగిరీలో 1,253 మంది, మైనారిటీ కేటగిరీలో 392 మంది ఉన్నారు. అర్హత నిర్ధారణ ప్రక్రియలో భాగంగా రెవెన్యూ, హౌసింగ్, మున్సిపల్ తదితర శాఖలకు చెందిన ప్రత్యేక బృందాలు దరఖాస్తులను పలుమార్లు పరిశీలించి అర్హుల జాబితాను రూపొందించాయి. ఈ సందర్భంగా కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ , అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి దశలవారీగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందేలా కృషి చేస్తామని తెలిపారు. గతంలో అర్హత సాధించిన లబ్ధిదారులను రాజకీయ కారణాలతో తొలగించబోమని ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే ఎంపికైన 542 మంది లబ్ధిదారులను కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 214 ఇళ్లకు అర్హులైన వారి సంఖ్య 2,500కు పైగా ఉండటంతో అందరికీ ఒకేసారి ఇళ్లు కేటాయించే అవకాశం లేనందున లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తున్నామని తెలిపారు.లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ సిఫార్సులకు, పార్టీ భేదాలకు తావులేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కోటా, పార్టీ సిఫార్సులు లేదా వ్యక్తిగత సిఫార్సుల ఆధారంగా ఎవరినీ ఎంపిక చేయబోమని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందించాలన్న లక్ష్యంతో భవిష్యత్‌లో మరిన్ని ఇళ్ల కేటాయింపునకు ప్రభుత్వ స్థాయిలో కృషి చేస్తామని చెప్పారు. ప్రస్తుత లక్కీ డ్రాలో ఇల్లు పొందని అర్హులైన వారు నిరాశ చెందవద్దని, వారి సమస్యను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి దశలో అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. లక్కీ డ్రాలో ఎంపికైన లబ్ధిదారులను అభినందిస్తూ, ఎంపిక కాని అర్హులు కూడా ప్రక్రియకు సహకరించాలని కోరారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో వంద శాతం పారదర్శకత పాటిస్తున్నామని తెలిపారు. దరఖాస్తులను రెవెన్యూ, హౌసింగ్, మున్సిపల్ శాఖల ప్రత్యేక బృందాలు పలుమార్లు పరిశీలించి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులను గుర్తించాయని చెప్పారు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ముందుగా కేటగిరీల వారీగా, అనంతరం వార్డు వారీగా లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.లక్కీ డ్రా ప్రక్రియను నిరంతర వీడియో రికార్డింగ్‌తో నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఎలాంటి సిఫార్సులు, జోక్యాలకు అవకాశం లేకుండా ప్రక్రియను రూపొందించామని, ప్రజాప్రతినిధులు, అధికారులు, దరఖాస్తుదారుల సమక్షంలో పారదర్శకంగా ఎంపిక చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుత దశలో ఇళ్లు పరిమితంగా ఉండటం, అర్హుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో లక్కీ డ్రా విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలిపారు. ఎంపిక ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు.కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ, కొత్తగూడెంలో గతంలో అర్హత సాధించిన లబ్ధిదారులను కొనసాగిస్తూ, మిగిలి ఉన్న 214 ఇళ్లకు మాత్రమే ప్రస్తుత లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వార్డుల వారీగా అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటూ ఎంపిక ప్రక్రియను చేపడుతున్నామని చెప్పారు. భవిష్యత్‌లో మరిన్ని ఇళ్లు అందుబాటులోకి వస్తే అర్హత కలిగిన వారికి అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి , గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్ కొత్తగూడెం సహకార సంఘం అధ్యక్షులు మండే వీర హనుమంతరావు , మున్సిపల్ కమిషనర్ సుజాత, తాసిల్దార్లు పుల్లయ్య, కృష్ణ ప్రసాద్,పీడీ హౌసింగ్ సేవరం , రెవెన్యూ, హౌసింగ్, మున్సిపల్ శాఖల అధికారులు, సిబ్బంది, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, దరఖాస్తుదారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ